జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ముందు న్యూఢిల్లీలో ఘనంగా జరిగిన ‘ప్రథమ్ సంకల్ప్’ ఈవెంట్
భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో రామాయణం ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజంలోనూ రామాయణం తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది.
ఇప్పుడు ఆ శాశ్వత గాథ మరో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది.
జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ముందు, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ‘రామాయణ’ చిత్ర బృందం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా తొలి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో నిర్వహించిన ఈ వేడుక, ‘భారత్ నుంచి ప్రపంచానికి రామాయణ ప్రయాణానికి’ శ్రీకారంగా నిలిచింది.
భారతీయ సంప్రదాయంలో ‘సంకల్పం’ అంటే ఒక మహత్తర కార్యాన్ని ప్రారంభించే ముందు చేసే పవిత్ర ప్రతిజ్ఞ. అదే భావాన్ని ప్రతిబింబిస్తూ, భారతదేశపు గొప్ప సాంస్కృతిక సంపదైన రామాయణాన్ని అత్యంత ప్రామాణికంగా, కళాత్మకంగా, భక్తి భావంతో ప్రపంచ ప్రేక్షకులకు అందించాలనే తమ నిబద్ధతకు ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది.
ఈ మహా ప్రయాణానికి న్యూఢిల్లీని ప్రారంభ వేదికగా ఎంచుకోవడం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. వైవిధ్యభరితమైన భారతదేశాన్ని రామాయణం విలువలు ఏకతాటిపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో, దేశ హృదయమైన రాజధానిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న అధికారిక ట్రైలర్‌ను ఎంపిక చేసిన అతిథులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఈ ప్రయాణం న్యూఢిల్లీకే పరిమితం కాలేదు. ‘రామాయణ స్కూల్స్ ప్రోగ్రామ్’ ద్వారా దేశవ్యాప్తంగా 500కు పైగా పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులు రామాయణం బోధించే శాశ్వత విలువలను సృజనాత్మక కార్యక్రమాల ద్వారా తెలుసుకునే అవకాశం పొందారు. అందులో విజేతలుగా నిలిచిన కొందరు చిన్నారులను ‘ప్రథమ్ సంకల్ప్’ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. అలాగే దేశంలోని 20 నగరాల్లో వందలాది మంది చిన్నారులు, కంటెంట్ క్రియేటర్లు, అభిమానులు ప్రపంచవ్యాప్త విడుదలకు ముందే ట్రైలర్‌ను ప్రత్యేకంగా వీక్షించే అవకాశం పొందనున్నారు.
‘ప్రథమ్ సంకల్ప్’ కార్యక్రమం మరో ప్రత్యేకతను కూడా సంతరించుకుంది. ‘రామాయణ’ చిత్రంలోని ప్రధాన తారాగణం తొలిసారిగా ఒకే వేదికపై సందడి చేసింది. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు తరాల కళాకారులను, భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఒకే వేదికపై కలిపిన ఈ వేడుక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ పాల్గొన్నారు. భారతీయ భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూనే, ‘దంగల్’ చిత్రంతో చైనా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన ఆయన, ఇప్పుడు ‘రామాయణ’ ను తెరకెక్కిస్తున్నారు.
ఈ వేడుకలో భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఒకే వేదికపై సందడి చేశారు. రామానంద్ సాగర్ ‘రామాయణం’ లో శ్రీరాముడి పాత్రతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అరుణ్ గోవిల్, ఈ చిత్రంలో దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. అలాగే శోభన కైకేయి పాత్రలో, అజింక్య దేవ్ విశ్వామిత్ర మహర్షిగా, కునాల్ కపూర్ ఇంద్రుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, రవీ దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు.
ఈ అద్భుత తారాగణానికి నాయకత్వం వహిస్తున్నది రణ్‌బీర్ కపూర్. ఆయన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. సాయి పల్లవి సీతాదేవి పాత్రలో తన హుందాతనం, కరుణ, ఆత్మస్థైర్యాన్ని తెరపై ఆవిష్కరించనుండగా, పాన్ ఇండియా స్టార్ రాకింగ్ స్టార్ యశ్ ఈ చిత్రానికి తన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు, మహాబలశాలి రావణుడు పాత్రను పోషిస్తున్నారు.
ఈ వేడుకకు సన్నీ డియోల్ అనూహ్యంగా హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన హనుమంతుడు పాత్రలో ఆయన నటిస్తున్నారు.
భారతీయ సినీ పరిశ్రమలోని అత్యుత్తమ ప్రతిభను, ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు, సాంకేతిక నిపుణులు, కళాకారులతో కలిపి ఒకే వేదికపైకి తీసుకురావాలన్న నిర్మాత నమిత్ మల్హోత్రా సంకల్పానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది. మానవాళి చరిత్రలోనే అత్యంత పురాతనమైన, శాశ్వతమైన కథల్లో ఒకటైన రామాయణంను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని స్థాయిలో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ఆయన లక్ష్యం.
నిర్మాత, క్రియేటివ్ ఆర్కిటెక్ట్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ… రామాయణం కేవలం మన గొప్ప ఇతిహాసాల్లో ఒకటి మాత్రమే కాదు. అది మన జీవన విధానంలో భాగం. మనం ఎలా జీవించాలి, ఎలా పండుగలు జరుపుకోవాలి, మన విలువలను తదుపరి తరాలకు ఎలా అందించాలి అనే విషయాలను అది నేర్పుతుంది. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి పండుగలు వెలుగు చీకటిపై, ధర్మం అధర్మంపై సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ రామాయణ సందేశాన్ని మళ్లీ మళ్లీ మనకు గుర్తుచేస్తుంటాయి.
వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన కథలు ఇప్పటికీ కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేయడం చాలా అరుదు. అలాంటి అపూర్వమైన కథే రామాయణం.
ప్రపంచ సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాలు పని చేసిన అనుభవంతో నేను ఎప్పుడూ ఒక విషయం నమ్మాను. భారతదేశపు గొప్ప కథలు ప్రపంచంలోనే అతిపెద్ద వేదికపై చెప్పబడాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అత్యుత్తమ కళాకారులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచస్థాయి నైపుణ్యం, ఒకే లక్ష్యంతో పనిచేసే బృందం మనకు ఉంది. అందుకే భారతదేశపు ఈ అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు దాని గొప్పతనానికి తగిన స్థాయిలో అందించగలుగుతున్నాం.
ఇది భారతదేశపు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచంతో పంచుకునే ఒక మహా ప్రయాణానికి శ్రీకారం. ఈ కథను భారత్ ఎప్పటినుంచో జీవిస్తోంది. ఇప్పుడు దాన్ని ప్రపంచంతో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం.”
దర్శకుడు నితేశ్ తివారీ మాట్లాడుతూ… రామాయణం ప్రపంచంలో చెప్పబడిన గొప్ప కథల్లో ఒకటి. దాని గొప్పతనం పరిమాణంలో కాదు… అది ప్రతిబింబించే శాశ్వత విలువల్లో ఉంది. ఒక దర్శకుడిగా దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యేలా మార్చాలనే బాధ్యత నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే అది ఇప్పటికే విశ్వజనీనమైన కథ. నా బాధ్యత ఒక్కటే… దాన్ని సంపూర్ణ నిజాయితీతో, ప్రామాణికతతో, అత్యంత గౌరవంతో తెరపై ఆవిష్కరించడం.
రచన నుంచి నటన వరకు, ప్రొడక్షన్ డిజైన్ నుంచి సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ వరకు… ప్రతి ఫ్రేమ్‌లో ఒకే ఆలోచనతో పనిచేశాం. ఈ అద్భుతమైన వారసత్వానికి తగిన గౌరవాన్ని ఇస్తూనే, అత్యున్నత సినీ నైపుణ్యంతో దాన్ని ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నించాం.
ఈ విజన్‌ను సాకారం చేయడానికి ప్రపంచంలోని అత్యుత్తమ కళాకారులు, సాంకేతిక నిపుణులు, కథకులతో కలిసి పనిచేయడం నా జీవితంలో ఒక గొప్ప అనుభవం. ప్రేక్షకులు ఈ సినిమాలో కేవలం విజువల్ స్పెక్టకిల్ మాత్రమే కాకుండా, రామాయణంలోని భావోద్వేగం, మానవత్వం, వేల ఏళ్లుగా దాన్ని చిరస్థాయిగా నిలబెట్టిన ఆత్మను కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాను.”
రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ… జై శ్రీరామ్. ముందుగా అరుణ్ గారికి ఒక విషయం చెప్పాలి. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణంలో శ్రీరాముడి పాత్రను ఆయన ఎంతో అద్భుతంగా పోషించారు. అరుణ్ గారిని శ్రీరాముడి పాత్రలో చూసి తరతరాల ప్రేక్షకులు స్ఫూర్తి పొందారు. ఎంతోమందికి ఆయన ఆ పాత్రతో ఆదర్శంగా నిలిచారు.
చిన్నప్పటి నుంచి శ్రీరాముడి కథలు వింటూ, ఆయన నామస్మరణ, ఆశీస్సులతో పెరిగాను. శ్రీరాముడిని ఎప్పుడూ నా మనసులో ఉంచుకుని జీవించాను. అలాంటి శ్రీరాములవారి పాత్రను పోషించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
యశ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా క్రెడిట్ అంతా నమిత్ మల్హోత్రా గారికే దక్కుతుంది. ఈ సినిమాలో భాగం అయ్యే అవకాశం ఆయనే నాకు ఇచ్చారు. ఇది కేవలం ఒక సినిమా కాదు… ఇండియా డ్రీమ్. ఆ కలను నిజం చేయడం కోసం మేమంతా ఒక్కటిగా కలిసి పనిచేశాం. శ్రీరాములవారి కథను ప్రపంచ స్థాయిలో అత్యంత గొప్పగా చెప్పాలన్నదే మా లక్ష్యం.
రణ్‌బీర్ తన పాత్రతో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అలాగే సీత పాత్రలో సాయి పల్లవి గారి నటనను ప్రేక్షకులంతా ఎంతగానో ఇష్టపడతారు. రకుల్ ప్రీత్ సింగ్ గారు, శోభన గారు, అలాగే ఈ సినిమాలోని ప్రతి నటీనటుడు అద్భుతంగా నటించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.”
సాయి పల్లవి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఇలాంటి గొప్ప పాత్రలను పోషించడం ప్రతి నటీనటుడికి ఒక పెద్ద సవాల్. ఈ సినిమాలోని పాత్రలు భవిష్యత్ తరాలకు కూడా పురాణ పాత్రలుగానే గుర్తుండిపోతాయి. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
సీతమ్మ పాత్రను పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాత్రకు పూర్తి నిజాయితీతో న్యాయం చేయాలని ప్రయత్నించాను. ఈ పాత్రను పోషించే క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ ప్రయాణం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవంగా నిలిచిపోతుంది.”
ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో, డినెగ్ (DNEG), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలైన హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాల పరంగా ‘రామాయణ’ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.
‘ప్రథమ్ సంకల్ప్’ కార్యక్రమంతో ‘భారత్ నుంచి ప్రపంచానికి రామాయణ ప్రయాణం’ అధికారికంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను జూలై 24, 2026న విడుదలయ్యే అధికారిక ట్రైలర్‌ను వీక్షించాలని చిత్ర బృందం ఆహ్వానిస్తోంది. దీపావళి 2026 సందర్భంగా ‘రామాయణ: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.