టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ దర్శకుడిగా మారనున్నారు. దీనికోసం ఆయన సన్నాహాలు ప్రారంభించారు. త్వరలోనే తన సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లను చకచకా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నటీనటుల ఎంపిక సైతం ప్రారంభమైనట్టు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘‘దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్.. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ యాక్టింగ్ పోర్ట్‌ఫోలియోస్, రెజ్యూమ్స్, షోరీల్స్ నా మెయిల్‌కు పంపించగలరు’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాతగానూ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
తొలుత రాహుల్ రామకృష్ణ షార్ట్ ఫిల్మ్స్ చేసేవారు. ఆ తరువాత ఆయన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ చిత్రంతో రాహుల్ రామకృష్ణ ఏకకాలంలో నటుడిగానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీలో బాగానే నిలదొక్కుకున్న రాహుల్ రామకృష్ణ.. ఆ తర్వాత తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘చి.ల.సౌ.’, ‘గీత గోవిందం’, ‘కల్కి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల.. వైకుంఠపురములో..’, ‘జాతిరత్నాలు’, ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాల్లో నటించారు.