ఏదైనా ఫిక్షనల్ స్టోరీ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు దర్శకధీరుడు రాజమౌళి. మహాభారతాన్ని సినిమాగా రూపొందించాలనేది ఆయన కోరిక. ఇప్పటికే దానిని వెల్లడించారు. అభిమానులు సైతం రాజమౌళి మహాభారత ప్రాజెక్టును ఎప్పుడు ప్రకటిస్తారా? అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించడం కష్టమేనేమో అనిపిస్తోంది. మహాభారతం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. ఫ్రాంచైజీ కింద తెరకెక్కించాల్సిందే. ఈ విషయాన్ని రాజమౌళి కూడా వెల్లడించారు. ఐదు భాగాలుగా తీస్తానని తేల్చారు. అయితే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహాభారతం ఆధారంగా సినిమాను నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాదే ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఇక మహాభారతం అనేది చేపట్టాక సింపుల్‌గా తీయడానికి అయితే అవదు. భారీగానే తరకెక్కించనున్నట్టు అమీర్‌ఖాన్ చెప్పారు.
పలు భాగాలుగా తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు కోసం పలువురు దర్శకులు పని ప్రారంభించనున్నారని.. అన్ని భాగాల షూటింగ్ ఏకకాలంలో ప్రారంభమవుతుందని అమీర్ ఖాన్ వెల్లడించారు. త్వరలోనే నటీనటుల ఎంపిక కూడా చేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా రూపొందితే రాజమౌళికి ఇబ్బందికరంగా మారుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇంతకు మించి తీయాల్సి ఉండటంతో ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ అమీర్‌ఖాన్ ఆ రేంజ్‌లో తీయలేకుంటే మాత్రం రాజమౌళికి మంచి ప్లస్ అవుతుంది. రామాయణం, మహాభారతం అనేవి ఎవర్‌గ్రీన్ ప్రాజెక్టులు. అద్భుతంగా వచ్చిందా.. ఎవరు తీసినా చూస్తారు. అయితే అమీర్ ఖాన్ నుంచి సినిమా వస్తుండటంతో రాజమౌళి తన ఆలోచనను విరమించుకుంటారని కొందరు.. అంతకు మించి తీస్తారని మరికొందరు భావిస్తున్నారు. ఇక చూడాలి.. రాజమౌళి తీస్తారో.. సైడ్ అయిపోతారో..