రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ వైసీపీ ప్రభుత్వానికి.. ముఖ్యంగా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కష్టసుఖాల్లో మెలిగిన విజయసాయిరెడ్డి ఇలా రివర్స్ అవుతారని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరేమో. దీనిలో కొంత జగన్ స్వయంకృతమూ ఉంది. ఎక్కడికెళ్లినా విజయసాయిరెడ్డిని వెంటేసుకుని తిరిగిన జగన్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ఆయనను దూరం పెట్టడం ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయనను పక్కకు తప్పించారు. అన్ని విధాలుగా విజయసాయిరెడ్డిని లాక్ చేశారు. ఈ పరిణామాలతో అప్పట్లోనే ఆయన తీవ్రంగా కలత చెందారు. అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ విజయసాయి కనీసం క్యాంపెయినింగ్‌కు కూడా రాకపోవడం గమనార్హం. మధ్యలో మంటలు చల్లారాయనుకున్నా నివురుగప్పిన నిప్పులా అలాగే ఉన్నాయని ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోంది.
అక్కడి నుంచే అసలు కథ మొదలు..
విజయసాయిరెడ్డి.. వైసీపీకి రాజీనామా చేశారు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమైంది. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ బాగోతానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆయన కళ్లకు కట్టినట్టుగా నాడు ఏం జరిగిందో సిట్‌కు వివరిస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ తీగ లాగితే డొంకంతా కదులుతోంది. విజయసాయిరెడ్డి నాడు ఏం జరిగిందనేది సిట్ విచారణకు హాజరై పూస గుచ్చుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగిందనేది వాస్తవమేనని ఆయన ఒకరకంగా అంగీకరించారు. నాడు మద్యం కుంభకోణం కారణంగా భారీగా అనుచిత లబ్ది పొందిన కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముందు వరుసలో ఉంటుందనేది ప్రధాన ఆరోపణ. అదాన్ వెనుక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా పని చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఉన్నారని విజయసాయిరెడ్డి తేల్చేశారు.
రెండు సమావేశాలూ నా ఇంట్లోనే..
మద్యం వ్యాపారం చేసుకుంటామని తమ అరబిందో కంపెనీ నుంచి రూ.100 కోట్లు ఇప్పించాలని మిథున్ రెడ్డి, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై డిస్టిలరీస్ యజమాని) తనను అడగడంతో అరబిందో శరత్ చంద్రారెడ్డికి సిఫారసు చేసినట్టు విజయసాయి తెలిపారు. ఈ క్రమంలోనే అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.60 కోట్లు, డీకార్ట్‌కు రూ.40 కోట్లు రుణం ఇప్పించినట్టు స్పష్టం చేశారు. నూతన మద్యం విధానానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి రెండు సమావేశాలు హైదరాబాద్, తాడేపల్లిలోని తన నివాసాల్లోనే.. తన సమక్షంలోనే జరిగాయని విజయసాయిరెడ్డి సిట్ విచారణలో అంగీకరించారు. మొత్తానికి ముందుగా చెప్పినట్టుగానే విజయసాయిరెడ్డి మద్యం విధానానికి సంబంధించి అన్ని విషయాలనూ బట్టబయలు చేసి వైసీపీ నేతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. ఏ క్షణం ఎవరు అరెస్ట్ అవుతారోనన్న ఆందోళనతో వైసీపీ నేతలంగా గుండె అరచేతిలో పట్టుకుని కాలం గడుపుతున్నారు.