శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. “దీవాన” సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాలతో పాటు మూవీ హైలైట్స్ తెలిపారు హీరో హర్షిత్ రెడ్డి.
– మా నాన్న స్వస్థలం మిర్యాలగూడ. నేను పుట్టి పెరిగింది, చదువుకున్నది అంతా హైదరాబాద్ లోనే. సిటీ కల్చర్, ఇక్కడి లైఫ్ స్టైల్ తెలుసు. ఫస్ట్ యూట్యూబ్, ఇన్ స్టాలో వీడియోస్ చేస్తుండేవాడిని. ఆ వీడియోస్ చూసి వైజయంతీ సంస్థ నిర్మించిన మెయిల్ సినిమాకు సెలెక్ట్ చేశారు. అది కోవిడ్ టైమ్, ఆన్ లైన్ లోనే ఆడిషన్ తీసుకున్నారు. మహబూబాబాద్ లో ఒక బాయ్స్ హాస్టల్ తీసుకుని, అందులోనే స్టే చేస్తూ దాదాపు రెండు నెలల్లో సింగిల్ షెడ్యూల్ లో మెయిల్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాం. ఆ సినిమాలో బీకామ్ కంప్యూటర్స్ అంటూ నేను చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. ఆ డైలాగ్ నచ్చి రాజ్ అండ్ డీకే శుభం సినిమాకు నన్ను ఎంపిక చేశారు. ఇదంతా ఒక డెస్టినీలా జరిగిపోయింది. కల్కి సినిమాలో ఆడిషన్ లేకుండానే నన్ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు సెలెక్ట్ చేశారు. నేను ఒకరోజు అడిగితే, చూడగానే పాపం అనిపించే మొహం కావాలి. నిన్ను చూస్తే అలా అనిపించి ఆడిషన్ లేకుండా తీసుకున్నాం అని చెప్పారు. నేను బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉండగా ఈ అవకాశాలు ఒక్కొక్కటిగా రావడం మొదలైంది. రెండు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించాను.
– శుభం సినిమా కంటే ముందే “దీవాన” ఆఫర్ వచ్చింది. ఆహాలో నేను మెయిల్, తరగతి గది..ఇలాంటి మూవీస్ చేశాను. అలా నాకు వాసు గారు, శ్రీదేవి గారు పరిచయం. ఈ మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు వాళ్ల దగ్గరకు తీసుకెళ్లి డైరెక్టర్ ను పరిచయం చేశాను. స్క్రిప్ట్ నచ్చి వాళ్లు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. వీలైనంత బెటర్ మెంట్స్ చేయాలనే కొంచెం టీమ్ తీసుకుని చేశాం. మేము సినిమా కంప్లీట్ చేస్తున్న దశలో అరవింద్ గారు మా టీమ్ కు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక చూసి గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తామని చెప్పారు. “దీవాన” సినిమాకు ప్రతి షెడ్యూల్ కు అన్నీ రీచెక్ చేసుకుంటూ డైలాగ్స్ బాగుండేలా చూసుకుంటూ షూటింగ్ చేస్తూ వచ్చాం. పక్కాగా వర్క్ షాప్స్ చేశాం. మూడు రోజులు షూటింగ్ చేస్తే, పది రోజులు వర్క్ షాప్స్ చేశాం. అంత ఇంటెన్స్ గా మమ్మల్ని డైరెక్టర్ ప్రిపేర్ చేశాడు. దాంతో కొంత డిలే అయ్యింది. మా మూవీకి టైమ్ తీసుకున్నాం గానీ ఎప్పుడూ రీ షూట్స్ చేయలేదు. ఎంత బాగా డిస్కస్ చేసి పర్ ఫార్మ్ చేస్తే ఈ క్యారెక్టర్ అంత బాగా వస్తుంది. అందుకే సెట్ లో ఇంప్రువైజేషన్స్ చేశాం. సినిమా అంతా రియల్ లొకేషన్స్ లో చేశాం. సీన్స్ లో కనిపించే క్రౌడ్ అంతా షూటింగ్ చూడటానికి వచ్చిన రియల్ జనమే.
– “దీవాన” సినిమాలో నా క్యారెక్టర్ పేరు మున్నా. ఆ క్యారెక్టర్ లో ఓల్డ్ సిటీ అబ్బాయి అనే వైబ్ కనిపించాలి. మా ఆడిషన్ కు చాలా మంది పక్కా హైదరాబాదీ కుర్రాళ్లు వస్తుండేవాళ్లు. వాళ్లను అబ్జర్వ్ చేశా. నేను మలక్ పేట, కొత్త పేటలో తిరిగిన కుర్రాడినే. మా డైరెక్టర్ సికింద్రాబాద్ వాసి కావడం కూడా కలిసొచ్చింది. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అన్నీ సాఫ్ట్ రోల్స్. ఇది డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి ఈ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అవడానికి కొంచెం టైమ్ పట్టింది. నా క్యారెక్టర్ రంగీలాలో ఆమిర్ ఖాన్ లా ఉండాలని మా డైరెక్టర్ చెప్పారు. ఒక షెడ్యూల్ లో అవున్రా చిల్లరగాన్నేరా అనే డైలాగ్ ఉన్న సీన్ చేశాం. ఆ సీన్ తర్వాత నుంచి మున్నా క్యారెక్టర్ మీటర్ తెలిసింది. దాన్ని డెవలప్ చేసుకుంటూ నటిస్తూ వచ్చా.
– మున్నా క్యారెక్టర్ లో అర్జున్ రెడ్డి వైబ్స్ ఉన్నట్లు కొందరు చెప్పారు. మా మూవీలో నా పిల్లరా అనే డైలాగ్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ పోలిక వచ్చింది. అయితే హైదరాబాద్ లో కుర్రాళ్లు అలాగే మాట్లాడుతారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆ మాడ్యూలేషన్ బాగా ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. సినిమాలో అమ్మాయి నాకు హింట్ ఇచ్చిందా, సతాయించిందా, వద్దన్నదా అనేది మీరు సినిమాలోనే చూడాలి.
– ప్రేమలో పూర్తిగా మునిగిన ఓ కుర్రాడి కథే “దీవాన”. మనం చాలా ప్రేమ కథలు చూసి ఉంటాం గానీ ఇందులో ఒక కొత్త పాయింట్, ఎమోషన్ ఉంటుంది. ఆ పాయింట్ తో వచ్చే ఇంటర్వెల్ మిమ్మల్ని షాక్ కు గురిచేస్తుంది. కొద్ది నిమిషాలు మీరు అలా ఉండిపోతారు. మేము ట్రైలర్, టీజర్ లో కూడా ఆ పాయింట్ ఎక్కడా రివీల్ చేయలేదు. మనం రియల్ లైఫ్ లో ఎప్పుడో ఒకసారి దీవాన అవుతాం. మా డైరెక్టర్ కూడా ప్రేమలో ఒక దీవాననే.
– అల్లు అరవింద్ గారికి మా మూవీ విపరీతంగా నచ్చింది. ఆయన నన్ను పిలిచి కొన్ని సీన్స్ గురించి మాట్లాడారు. ఆ సీన్స్ లో బాగా నటించావని చెప్పారు. ఆయన ప్రశంసలు దక్కడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నేను చిరంజీవి గారు, విజయ్ దేవరకొండ, నాని, అల్లు అర్జున్…ఇలా అందరి మూవీస్ ఎక్కువగా చూశాను. వారి నటన తాలూకు ప్రభావం నాపై తెలియకుండా ఉందేమో. దీవాన సినిమా చూస్తుంటే మీకు అర్జున్ రెడ్డి మూవీ గుర్తుకురాదు. మున్నా క్యారెక్టర్ లోని హైదరాబాద్ నేటివిటీ, అగ్రెషన్ వల్ల మీకు అలాంటి పోలిక అనిపించిందేమో. ఒక సీన్ డైరెక్టర్ చెప్పినప్పుడు దాన్ని నా పర్సనల్ టచ్ తో, లైవ్ లీగా చేయడానికి ప్రయత్నించాను. నా ఫ్రెండ్స్ బ్యాచ్ గా నటించిన వాళ్లు కూడా ఇక్కడి వాళ్లే. హైదరాబాద్, ఓల్డ్ సిటీ గ్యాంగ్ కలిసి చేసిన చిత్రమిది.
– మెయిల్ సినిమా తర్వాత నాకు వస్తున్న ప్రతి అవకాశాన్నీ విలువైనదిగా భావిస్తూ వస్తున్నా. ప్రతి ప్రాజెక్ట్ కు పూర్తి ఎఫర్ట్స్ పెట్టి నటిస్తున్నా. ప్రస్తుతం కల్కి 2 చిత్రంలోనూ నటిస్తున్నా. అలాగే రోమియో జూలియట్ అనే సినిమా చేస్తున్నా.