అభిరుచి, మంచి కాంబినేషన్ ఆర్టిస్టులతో ‘దీర్ఘాయుష్మాన్‌భవ’

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దీర్ఘాయుష్మాన్‌భవ’. ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలలో ఆమని, కాశీ విశ్వనాధ్, పృథ్వీరాజ్‌, సత్యం రాజేష్, గెటప్ శ్రీను , తాగుబోతు రమేష్. జె మిని సురేష్‌, నోయల్ తదితరులు నటించారు. ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలో త్రిపుర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించిన ‘దీర్ఘాయుష్మాన్ భవ’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రి రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ క్రమంలోనే సినిమాలోని పాటలు, ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రోమోస్‌ను ప్రముఖ నటుడు ఓ.కల్యాణ్, పాటలను జబర్దస్త్ ఆర్‌పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘కొత్త నిర్మాతలకు చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. అయితే కొత్త నిర్మాతలు చిత్ర పరిశ్రమ మీద కనీసం ఒక ఏడాది పాటు అవగాహన పెంచుకుని వస్తే బావుంటుంది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ తరపున మేము ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. పెద్ద, చిన్న సినిమాల సమస్యలు, సాధ్యాసాధ్యాల గురించి ఛాంబర్ లో చర్చించబోతున్నాం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, మంచి అభిరుచితో, మంచి కాంబినేషన్ ఆర్టిస్టులతో ఈ సినిమా తీసినట్లు అనిపిస్తోంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆస్తిస్తున్నాను’’ అని అన్నారు.

చిత్రాన్ని నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ తరపున థియేటర్లలో విడుదల చేస్తున్న నట్టి కుమార్ మాట్లాడుతూ,.. ‘‘చిన్న సినిమాల సమస్యలను తీర్చేందుకు ఇటు పరిశ్రమ, అటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. చిన్న సినిమాకు మధ్యాహ్నం 2:30 గంటల షోను కేటాయించాలి. మల్టీఫ్లెక్స్‌లలో పేదవాడు సినిమా చూసే విధంగా ఆక్యుపెన్సీలో 20 శాతం టిక్కెట్ రేట్లను.. రూ. 75గా నిర్ణయించాలి. ఫామిలీ అంతా కూర్చుని హాయిగా చూసుకునేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని అన్నారు. జబర్దస్త్ ఆర్‌పీ మాట్లాడుతూ.. ‘‘నట్టి కుమార్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు అంటే తప్పకుండా ఈ చిత్రంలో మంచి కంటెంట్ ఉంటుందని భావిస్తున్నాను. చిన్న సినిమాల సమస్యలు తొలగితే, పరిశ్రమకు మరింత మేలు జరుగుతుందన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు. చిత్ర నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 11న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అన్ని ఎమోషన్స్ ఉన్న చక్కటి చిత్రమిది’’ అని అన్నారు. చిత్ర దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ… “ఫ్యామిలీ ప్యాక్ చిత్రమిది. అందరినీ ఆహ్లదపరిచే కామెడీ, ఉంది. సోసియో ఫాంటసీ గా దీనిని మలిచాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెమినీ సురేష్, కల్యాణ్, గీత రచయిత రాంబాబు గోషాల తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *