మంచి పేరుకోసం జీవితకాలం కష్టపడి ఇప్పుడేమో ఇలానా…నోటి దురద తెచ్చే కష్టాలకి అంతే ఉండదు–––
పెదవి దాటని మాటకు మనం రాజైతే పెదవి దాటిన మాటకు మనం బానిస లనేది నానుడి. ఈ నానుడిని అనుసరిస్తూ తమ వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ తమలో తామే ఎదుగుతూ ఎంతో గొప్ప స్థానాలకు వెళ్లిన ఎంతోమంది మనకు తెలుసు. ఆదివారం జూన్ 1వ తేది హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో తాను దర్శకునిగా మారిన 32 ఏళ్లలో 42 సినిమాలు కుటుంబ కథాచిత్రాలను తెరకెక్కించి ఎంతోమంది నటీనటులకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు యస్.వి.కృష్ణారెడ్డి గారి జన్మదినం వేడుకలు జరిగాయి. ఈవెంట్ ఫ్లో అంతా సక్రమంగా వెళుతున్న సమయంలో నటుడు రాజేంద్రప్రసాద్ వేదికపైకి వచ్చి తన నోటికి పనిచెప్పారు. వేదిక దగ్గరలో ఉన్న నటులు అలీని ఉద్ధేశించి ఆ లం కొడుకు అంటూ, రోజాని నేనే పరిచయం చేశాను, ఏ ఆమని నీకు గుర్తుందిగా మనం ‘మిస్టర్ పెళ్లాం’ టైమ్‌లో అని ఆమనిని, ఇది చూడండి గుండ్రాయిలా తయారయింది అంటూ రవళిని తన స్టైల్లో సరదాగా మాట్లాడుతున్నాను అనుకున్నారు కానీ అవన్నీ లైవ్‌లో మీడియాకి చేరటంతో అనుకోని అనర్థం జరిగిపోయింది. ముఖ్యంగా స్టేజ్ పైనున్న అచ్చిరెడ్డి గారిని మనం కిందకి వెళ్లిన తర్వాత మాట్లాడుకుందాం అంటూనే పక్కనున్న సీనియర్ నటులు మురళీమోహన్‌గారిని ఉద్ధేశించి నీకు సిగ్గుండాలి అనటంతో అందరూ అవాక్కయ్యారు. 30 ఏళ్ల క్రితం ఉన్న మీడియా వేరు ఇప్పటి మీడియా వేరు…మనం ఏ స్టేజ్‌పై ఉన్నా , ఏ స్టేజ్‌లో ఉన్నా నోటిని అదుపులో పెట్టుకుని సందర్భోచితంగా మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోదగిన నిజం. అలా మనం మాట్లాడకపోతే మనలోని పాజిటివ్ విషయాలు, సింపతి కలిగిన విషయాలు కూడా పక్కదారి పట్టడం ఖాయం. మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మనం దొరికిపోవటం ఖాయం. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా కష్టపడితే వచ్చిన పేరు, ప్రతిష్టలు ఒక్కరోజుతో ఒక్కమాటతో కొట్టుకుపోవటమే కాకుండా మనల్ని చరిత్ర హీనులుగా మార్చేస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇకనుండైనా మైకు చేతిలో ఉన్నప్పుడు, కెమెరా ఎదురుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. లేదంటే ఇలానే వైరల్ కంటెంట్‌లు తయారవుతాయి. తస్మాత్ జాగ్రత్త….
శివమల్లాల
Also Read This :ఘనంగా దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు