మంచు విష్ణు కొడితే కుంభస్థలం కొట్టాలి అనుకున్నాడేమో ..అందుకే ప్రభాస్‌తో..

నిజమైన స్నేహమంటే ఇది…
మంచు విష్ణుకి ‘కన్నప్ప’ సినిమా 23వ సినిమా. ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి 22ఏళ్లు పూర్తయ్యి 23వ ఏడాదిలోకి వచ్చారు విష్ణు. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ‘విష్ణు’ (2003). అప్పటినుండి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రమోషన్‌ పరంగా మీడియాలో బాగానే హడావిడి చేస్తుంటాయి. కానీ థియేటర్ల దగ్గర మాత్రం అంత పెద్ద ఎత్తున సందడి చేయవు. వాస్తవానికి మంచు విష్ణు హీరోగా నటించిన ‘ఢీ’ సినిమా 2007లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమా తర్వాత విష్ణు కెరీర్‌ రాకెట్‌లా దూసుకెళ్లాలి. కానీ అలా జరగలేదని అందరికి తెలుసు. కానీ ఆ విషయాన్ని పెద్దగా ఎవ్వరూ మట్లాడరు. ఆ తర్వాత కొన్ని సినిమాలు విడుదలై నటునిగా విష్ణుకి మంచిపేరునే తెచ్చిపెట్టాయి. ఉదాహరణకు ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘మోసగాళ్లు’ వంటి సినిమాలు. ఆ సినిమాలు బాక్సాపీస్‌ వద్దకూడా పరవాలేదు అనిపించాయి. కానీ చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద బ్యాక్‌అప్‌ ఉంది అని కాదు. ఎంత పెద్ద సక్సెస్‌ ఉంది అని మాత్రమే చూస్తారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుుకోకపాయినా ఇది వాస్తవం. అందుకే ఈ వైఫల్యాలన్ని చూసిన తర్వాత కొడితే కుంభస్థలం కొట్టాలి అని విష్ణు నిర్ణయించుకున్నారని అందుకే ‘కన్నప్ప’ సినిమా మొదలు పెట్టిన్నట్లున్నారు అని సినిమా వర్గాల భోగట్టా . ఈ సినిమా మొదలైన రోజునుండి అన్ని పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి. అనేకమంది టాప్‌ హీరోలు మంచు విష్ణు హీరోగా సక్సెస్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ డేట్స్‌ను విష్ణుకి ఇచ్చారు. వారిలో ముఖ్యంగా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్, మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌లతో పాటు రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఉన్నారు. ప్రభాస్‌ రేంజ్‌ ఏంటో ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి తెలుసు. అంత గ్రేట్‌ పొజిషన్‌లో ఉన్న ప్రభాస్‌ విష్ణు అడగ్గానే కాదనుకుండా డేట్స్‌ ఇచ్చి చిత్రంలో ఎంతో ఇంపార్టెన్స్‌ ఉన్న రుధ్రుని పాత్రలో నటించారు. అది ప్రభాస్‌ స్నేహమంటే. అందుకే ఇండస్ట్రీ మొత్తానికి డార్లింగ్‌ అయ్యారు ప్రభాస్‌. ఏదేమైనా వీరందరూ యాడ్‌ అవ్వటంతో ‘కన్నప్ప’పై భారీగానే అంచనాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 150 కోట్లు పైనే ఖర్చుపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఎలా పెర్‌ఫార్మ్‌ చేస్తుందో అని చిత్రసీమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ‘కన్నప్ప’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 25న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే…
శివమల్లాల

 

Also Read This :బ్రహ్మానందానికి ‘బ్రహ్మానందం’ మరచిపోలేని తీపి జ్ఙాపకం అవ్వనుందా?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *