నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘హిట్ 3’. శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘హిట్ 3’ మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అది ఎప్పుడో కాదు.. మే 29 నుంచే. హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా రూపొందిన ఈ సినిమాలో రావు రమేశ్, సూర్య శ్రీనివాస్, అదిల్ పాలా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
‘హిట్ 3’ కథేంటంటే.. ఐపీఎస్ అధికారి అయిన అర్జున్ సర్కార్ (నాని) జమ్మూకశ్మీర్‌లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (హిట్)లో విధులు నిర్వర్తిస్తుంటాడు. ఆ సమయంలో ఓ దారుణ హత్య జరుగుతుంది. అది ఎవరు చేశారో ఇన్వెస్టిగేట్ చేస్తుండగానే.. అలాంటి హత్యలే దేశ వ్యాప్తంగా 13 చోట్ల జరుగుతాయి. ఇది ఎవరో ఒకరు చేస్తున్నది కాదని.. దీని వెనుక పెద్ద నెట్‌వర్స్ ఉందని గ్రహించిన అర్జున్.. దానిని ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. బిహార్, గుజరాత్ తదితర ప్రాంతాలకు వెళ్లి.. ఆ కేసు గురించి చాలా వరకూ ఇన్ఫర్మేషన్ సేకరిస్తాడు. కేస్ కొలిక్కి వస్తుందనుకున్న సమయంలో అర్జున్ సర్కార్ విశాఖకు బదిలీ అవుతాడు. ఆ కేస్‌ను అర్జున్ సర్కార్ ఛేదించాడా? ఆ హత్యల వెనుకున్న అదృష్ట శక్తి ఏంటి? వంటి అంశాలతో ఈ సినిమా రూపొందింది.