ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా సోమవారం రాత్రి కన్నుమూశారు. మణికొండలోని తన నివాసంలో శివశక్తి దత్తా తుదిశ్వాస విడిచారు. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు శివశక్తి సోదరుడు. శివశక్తి కొన్ని సినీ గీతాలను సైతం రాశారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబరు 8న రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించిన శివశక్తికి చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి ఉండేది. ఈ తరుణంలోనే ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయి ముంబైలోని ఆర్ట్స్ కాలేజీలో చేరి రెండేళ్ల తర్వాత స్వస్థలానికి తిరిగొచ్చి కమలేశ్ పేరిట చిత్రకారుడిగానూ పని చేశారు.
ఆ తర్వాత సంగీతంపై మక్కువతో గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకుని మద్రాసుకు వెళ్లి సోదరుడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి సినీరంగ ప్రవేశం చేశారు. 1988లో వచ్చిన ‘జానకి రాముడు’ చిత్రానికి శివశక్తి స్క్రీన్ రైటర్‌గా పని చేశారు. శివశక్తి దత్తాకు కీరవాణి, కల్యాణి మాలిక్, శివశ్రీ కంచి ముగ్గురు సంతానం. శివశక్తి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం శివశక్తి దత్తా మృతిపై స్పందించారు. ‘‘కీరవాణి తండ్రి, రచయిత శివశక్తి దత్తా కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగినవారాయన. పలు చిత్రాలకు పాటలు కూడా రాశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అంటూ పవన్ కల్యాణ్ పోస్ట్ పెట్టారు.