AAIA : ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో ప్రదీప్ సక్సెస్ కొట్టాడా?

AAIA :

విడుదల తేది: 11-10-2025
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, తదితరులు
ఎడిటర్‌: కోదాటి పవన్ కల్యాణ్
సంగీతం : రథన్
నిర్మాత: మాంక్స్‌ అండ్‌ మంకీస్‌
దర్శకత్వం: నితిన్ – భరత్
కథ: సందీప్ బొల్లా

బుల్లితెరపై సూపర్ సక్సెస్ సాధించిన దర్శకద్వయం నితిన్, భరత్‌లు వెండితెరపై ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో వచ్చారు. ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం చేరుకోగలిగిందా? చూద్దాం.

కథేంటంటే..

చాలా కాలం పాటు అమ్మాయే పుట్టని గ్రామంలో 60 మంది మగ సంతానం తర్వాత ఒక అమ్మాయి (దీపికా పిల్లి) పుడుతుంది. దీంతో ఆ అమ్మాయికి రాజకుమారి అని నామకరణం చేసి ముద్దుగా రాజ అని పిలుచుకుంటారు. అమ్మాయిని తమ ఊరు దాటి పోనివ్వకూడదని గ్రామమంతా కలిసి నిర్ణయించుకుంటారు. ఆ 60 మందిలోనే ఒకరితో ఆ అమ్మాయి పెళ్లి చేయాలని గ్రామ పెద్ద రాజ తండ్రి నుంచి ప్రామిస్ తీసుకుంటారు.

వేరే ఊరు నుంచి మగవాళ్లెవరూ రాకుండా గ్రామం చుట్టూ కంచె వేస్తారు. కట్ చేస్తే అలాంటి గ్రామంలోకి ఇంజినీర్ అయిన కృష్ణ మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ పనిపై వస్తాడు. ఆ తరువాత రాజతో ప్రేమలో పడతాడు. అది కాస్తా ఊరిలో అందరికీ తెలుస్తుంది. అప్పుడొక కండీషన్‌పై రాజతో వివాహం చేయడానికి ఊరంతా అంగీకరిస్తుంది. అసలు ఆ కండీషన్ ఏంటి? దానిని నెరవేర్చి రాజాను కృష్ణ వివాహం చేసుకున్నాడా? అనేది కథ.

సినిమా ఎలా ఉందంటే..

ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో నితిన్, భరత్ సినిమాను ప్రారంభించారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా కామెడీగా చక్కగా నడిపించారు. ప్రతి ఒక్క సీన్ అలరించింది. సత్య కామెడీ ఫస్ట్ హాఫ్‌కు ప్రాణం పోసింది. గెటప్ శ్రీను, సత్య ఇద్దరూ ఉన్న సీన్స్ అయితే హాయిగా నవ్వించాయి. సెకండాఫ్‌కు వచ్చేసరికి సినిమా దెబ్బ కొట్టింది. ఎప్పుడైతే కండీషన్ పెట్టారో అప్పటి నుంచి సినిమా గాడి తప్పింది. ఆ కండీషన్‌తో గతంలోనూ సినిమాలొచ్చాయి.

కానీ కామెడీతో మెప్పించవచ్చు కానీ సెకండాఫ్ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. దర్శకులకు ఫస్ట్ మూవీ కావడం వల్లనో ఏమో కానీ సినిమా ట్రాక్ తప్పింది. సెకండాఫ్ మొత్తం లాజిక్‌కు అందదు. ఫినిషింగ్ టచ్ మరీ దారుణం. ట్రక్‌‌లో పది మంది లోపే అమ్మాయిలను చూపించి పెళ్లి మాత్రం 60 మందితో జరిపించారు. సెకండాఫ్ గట్టిగా రాసుకుని ఉంటే సినిమా మంచి సక్సెస్ అయ్యుండేది. సెకండాఫ్‌లో కొన్ని పాత్రలు ఎందుకు వచ్చి వెళ్లిపోయాయో కూడా తెలియదు.

నటీనటుల పనితీరు..

ప్రదీప్ చాలా బాగా నటించాడు. సినిమాకు మెయిన్ ప్లస్ అంటే సత్య. దీపికా పిల్లి సైతం నటనతో మెప్పించింది. ఇక మిగిలిన వారంతా తమ పరిధి మేరకు చక్కగానే నటించారు.

టెక్నికల్‌ విభాగం: అవసరానికి మించి పాటలు ఉన్నాయనిపించింది. అయితే రథన్ సంగీతం మెప్పించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మంచి ప్లస్ అనే చెప్పాలి. టెక్నికల్ వ్యాల్యూస్, విజువల్స్ చాలా బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌: ఫస్ట్ హాఫ్, సత్య కామెడీ, ప్రదీప్ నటన

మైనస్‌ పాయింట్స్‌: సెకండాఫ్‌, లాజిక్ లెస్ నెరేషన్, సాగదీత

ఫైనల్‌ వర్డిక్ట్‌: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ కొంత మేర ఓకే

రేటింగ్: 2.5/5

శివ మల్లాల

Also Read This : రియల్ సినిమా మ్యాన్ – వీఎన్ ఆదిత్య.

Director V.N. Aditya Exclusive Interview
Director V.N. Aditya Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *