నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun S/O Vyjayanthi). విజయశాంతి (Vijyashanthi) పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. విజయశాంతిని ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె చాలా గొప్ప సినిమాలు చేశారని.. అలాంటి వైవిధ్యమైన పాత్రలు మరొకరెవరూ చేయలేదన్నారు. భారతదేశ చలనచిత్ర పటంలో హీరోలకి సమానంగా నిలుచున్న ఏకైక మహిళ విజయశాంతేనని కొనియాడారు.
అసలు ఈ సినిమా ఆలోచన కూడా ‘కర్తవ్యం’ చిత్రంలో ఉన్న పాత్రకు కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఆలోచన నుంచే ప్రారంభమైందన్నారు. విజయశాంతి, పృథ్వి, సోహెల్ లేకపోతే ఈ సినిమాయే లేదని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమాకు పని చేసిన వారంతా ప్రాణం పెట్టి చేశారు. ఆఖరి 20 నిమిషాలు థియేటర్స్‌లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయని తెలిపారు. ప్రతిసారి కాలర్ ఎగరేయమని తాను చెబుతుంటానని.. ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ని తాను ఎగరేస్తున్నానని ఎన్టీఆర్ తెలిపారు. కన్నీళ్లు ఆపుకోవడం తన వల్ల కాలేదని.. ఆ ఆఖరి 20 నిమిషాలు అలా రావడానికి కారణం కళ్యాణ్ అన్న మాత్రమేనని వెల్లడించారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ అన్న కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని ఎన్టీఆర్ తెలిపారు.
ప్రజావాణి చీదిరాల