Single Movie Review: ‘సింగిల్’ హీరో.. హీరోయిన్‌తో మింగిల్ అయ్యాడా?

విడుదల తేది– 09.05.2025
నటీనటులు: శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్
ఎడిటర్‌: ప్రవీణ్ కేఎల్
సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్‌రాజ్ ఐఎస్‌సీ
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
దర్శకత్వం: కార్తీక్ రాజు
నిర్మాత: విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉంటాయి. పైగా సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అంచనాలను మరింత పెంచేశాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? చూద్దాం.. లవ్ స్టోరీస్‌కు ఎప్పుడూ ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. దీనికి కామెడీ అనేది మిక్స్ అయి అది కాస్తా వర్కవుట్ అయ్యిందంటే సినిమా వేరే లెవల్. అసలు సినిమాలో కథ ఉండాల్సిన పని లేదు. బిజీ ప్రపంచంలో మనిషి మైండ్ హీటెక్కిపోయి ఉంటోంది. నవ్వడమే మరచిన మనుషులను రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వించగలిగితే సినిమా హిట్టే.

వాస్తవానికి ఒక సినిమాకు కథ డిఫరెంట్‌గా ఉండటమో.. లేదంటే కథలో కొత్తదనం ఉండటమో ప్రస్తుతం ప్రేక్షకులకు కావాలి. అవన్నీ లేవంటే కామెడీ అయినా బాగుండాలి. ఇవేమీ లేకుంటే ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చే పరిస్థితి లేదు. ఈ సినిమాలో ముందుగా మనం చెప్పుకున్నవేమీ లేవు కానీ కామెడీ మాత్రం కావల్సినంత ఉంది. విజయ్ (శ్రీ విష్ణు) తనకు కావల్సిన అమ్మాయి కోసం ఎదురు చూస్తుంటాడు. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిషోర్) మాత్రం గాయత్రి అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. పూర్వ (కేతిక శర్మ) అనే అమ్మాయిని చూసి విజయ్ లవ్‌లో పడతాడు. మరోవైపు హరిణి (ఇవానా) అతడిని ప్రేమిస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు ఎలాంటి మలుపు తీసుకుందనేదే కథ. వాస్తవానికి ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు కామనే. కథలో కొత్తదనం వంటివేమీ కనిపించవు కానీ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎండింగ్‌ను కార్తీక్ రాజు కాస్త డిఫరెంట్‌గా ఇచ్చారు.

ఒకప్పుడు పెళ్లంటే 25 ఏళ్ల లోపు చేసుకోవాలనే నియమం ఉండేది. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న సోషల్ మీడియా యుగంలో ఆ నంబర్ 35కు చేరింది. అలాంటి సోలో బ్రదర్స్ అందరూ జంట కోసం వెదుకుతూ సింగిల్‌గా ఉంటూ ఎవరితో మింగిల్ అవుదామని ఆలోచనతో బతుకుతుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే.. అలాంటి సోలో బ్రదర్స్ కథే ‘సింగిల్’. దీనిని శ్రీ విష్ణు మాత్రమే హీరో కాదు.. వెన్నెల కిషోర్ కూడా హీరోయేనని చెప్పాలి. ఒకప్పుడు సినిమాకు 6 పాటలు.. 6 కామెడీ సీన్లనే లెక్కలుండేవి. వాటిని తుంగలో తొక్కేసి కొత్త డైరెక్టర్లు కంటెంట్‌తో రాజ్యమేలుతున్నారు. అలాంటి కంటెంట్ ఉన్న దర్శకుడు కార్తీక్ రాజే.. శ్రీవిష్ణుతో సామజవరగమన’ తెరకెక్కించారు. ‘సింగిల్’ను కూడా ఇదే టీంతో రూపొందించారు.

నటీనటుల పనితీరు: శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ ద్వయం సినిమాకు ప్రాణం. వీరిద్దరిలో ఎవరు లేకున్నా సినిమా ఎలా ఉండేదో కానీ ఇద్దరూ తమదైన కామెడీతో ప్రేక్షకులను ఆద్యంతం అలరించారు. ఇవానా, కేతిక శర్మ నటన ఆకట్టుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్ గురించి వేరే చెప్పాలా? అద్భుతంగా నటించారు.

టెక్నికల్‌ విభాగం: టెక్నికల్ విభాగం విషయంలో ముందుగా చెప్పుకోవల్సింది.. డైలాగ్స్ రాసిన నందు, భానుల గురించి. ఈ డైలాగ్సే సినిమాకు ప్రాణం. సంగీతం అయితే పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకు తగినట్టుగా బాగుంది.

ప్లస్‌ పాయింట్స్‌: కామెడీ, నటీనటుల పనితీరు

మైనస్‌ పాయింట్స్‌: కథలో కొత్తదనం లేకపోవడం, సాగదీత

ఫైనల్‌ వర్డిక్ట్‌: వెల్ కమ్ అండ్ ఎంజాయ్ ద కామెడీ

రేటింగ్: 3.25/5

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *