కొన్ని పాటలు ఎందుకోగానీ రిలీజ్ అయిన వెంటనే ఎక్కవు. ఆ తరువాత సోషల్ మీడియాను ఏలేస్తూ ఉంటాయి. అలాంటి సాంగ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ‘కిస్మత్‌పూర్’లో ఉంటే పూర్ మాత్రమే మిగిలింది మామా’ అంటూ హైదరాబాద్ కష్టాలను వివరించే పాటది. గడ్డం రమణారెడ్డి దర్శకత్వంలో బీఆర్కే న్యూస్ అధినేత రామకృష్ణ నిర్మించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. ఈ చిత్రంలో అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషించారు. ఎమ్మెల్యే కావొచ్చు.. సీఎం కావొచ్చు.. ఒక పొలిటీషన్ బిజీగా ఉన్న సమయంలో ఆయన భార్య బయటకు వచ్చి ప్రజల సమస్యలు వింటే ఆ తరువాత పరిణామాలు ఎలా మారుతాయనే ఈ చిత్ర కథాంశం. ప్రజల సమస్యల పరిష్కారంలో రాజకీయ నేతల భార్యలు కూడా భాగమైతే సమాజంలో మార్పు వస్తుందనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలోని ఒక సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను అల్లాడిస్తోంది.
బతుకుదెరువు కోసం హైదరాబాద్ వస్తే.. జీవితం ఎలా మారిపోయిందో ఈ పాట ద్వారా చిత్రంలో వివరించారు. హైదరాబాద్ ప్రజలకు ఈ సాంగ్ బాగా కనెక్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఎన్నో కలలతో హైదరాబాద్ వచ్చిన వారికి అదెలా ‘హైడ్రాబ్యాడ్’గా మారిందో ఒక ఫన్నీ వేలో ఈ పాట ద్వారా దర్శకుడు వివరించారు. ‘ఆనాడు హైదరాబాద్ సిటీ.. ఈనాడు ‘హైడ్రాబ్యాడ్’గా మారిన సిటీ. నవాబులతో రువాబుగా ఉన్న సిటీ.. రియల్ ఎస్టేట్‌లో నంబర్ 1 అన్న సిటీ. టెర్రిఫిక్ ట్రాఫిక్‌తో నిండిన సిటీ.. లంచాలు, కంచాలకు అడ్డా అయిన సిటీ. ఈ సిటీలో ఏదైనా చేసుకుని బతుకుదామని ఎర్రబస్సెక్కి ఎర్రగడ్డలో దిగినా..’ అంటూ సాగే ఈ సాంగ్ లిరిక్స్ కడుపు చేత పట్టుకుని హైదరాబాద్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితానికి అద్దం పడుతుంది.
ప్రజావాణి చీదిరాల