ప్రతి ఒక్కరూ కల కంటారు. వాటిలో సినిమా కల అనేది ప్రత్యేకం. ఈ కల కనడానికి ఓ అర్హత ఉండాలి. సాకారం చేసుకోవడానికి గట్స్ ఉండాలి. అర్హత, గట్స్ లేకుంటే కల కలగానే మిగిలిపోతుంది. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం.. అంతా బాగుంటే ఇంద్రదనస్సు.. లేదంటే రంగు పడుద్ది. ఎందరికో సినిమా లైఫ్ ఇస్తుంది.. మరెందరినో కలల ప్రపంచంలో ఊయలలూపి దూరంగా పడేస్తుంది. ప్రతి శుక్రవారం కనీసం రెండు నుంచి ఐదు సినిమాలైనా విడుదలవుతాయి. మరి వాటిలో హిట్ ఎన్ని? ఫట్ ఎన్ని? ఎన్నో విభాగాలు, ఎందరో మనుషులు కలిస్తే ఒక సినిమా తయారవుతుంది. అలాంటి సినిమా ఎందరికి లైఫ్ ఇస్తుంది? ఎందరికి లైఫ్‌ని దూరం చేస్తుంది? సినిమా మంచి సక్సెస్ సాధిస్తే నటీనటులందరికీ.. దర్శకనిర్మాతలు, సాంకేతిక బృందానికి కలిసొస్తుంది. అదే దెబ్బ కొట్టిందా? అందరి పరిస్థితేమో కానీ దర్శకుడు, హీరోహీరోయిన్ల పరిస్థితి ఏంటి?
సినిమా కోసం కథ సిద్ధం చేసుకుని చెప్పులరిగేలా ఇండస్ట్రీ ప్రముఖుల చుట్టూ తిరుగుతారు. సినిమాకు కావల్సిన వారందరినీ సెట్ చేసుకుని చివరకు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ క్షణం.. దర్శకుడు, హీరోహీరోయిన్ల కళ్లల్లో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అక్కడి నుంచి మొదలు.. తిరిగి సినిమాను పట్టాలెక్కించేంత వరకూ శ్రమించాల్సిందే. అసలైన కష్టం అక్కడ మొదలవుతుంది. ఎండ, వాన దేనినీ లెక్కచేయకుండా శ్రమిస్తారు. షూటింగ్ కోసం అవసరమైతే ఖండాంతరాలు దాటుతారు. షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టేవరకూ అహర్నిశలూ శ్రమించాల్సిందే. ఇక అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది. ప్రమోషన్స్, సెన్సార్ అన్నీ దాటుకుని సినిమా విడుదల తేదీ కోసం ఆశగా ఎదురు చూస్తారు. రెండు రోజుల్లో విడుదల అనగా వారిలో ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. తిండి, నిద్ర ఏమీ ఉండదు. ఇంతమందిని మెప్పించిన దర్శకుడు, హీరోహీరోయిన్లు ప్రేక్షకులను మెప్పించగలమా? లేదా? అని ఆందోళన చెందుతారు. ఎందుకంటే ప్రేక్షకులే అంతిమ న్యాయనిర్ణేతలు. వారికి నచ్చితే సినిమా నిలబడటంతో పాటు వారు కూడా నిలబడతారు. లేదంటే అంతా పడిపోతారు. ఇదేమీ కెరటం కాదు.. పడితే ఉవ్వెత్తున లేవడానికి అదృష్టం ఉంటేనే లేస్తారు. ముఖ్యంగా దర్శకుడు, హీరో. అంతో ఇంతో హీరోయిన్ పరిస్థితి బెటర్. గ్లామర్ ఉందంటే సినిమా ఫట్ అయినా నెక్ట్స్ అవకాశం వస్తుంది. కానీ హీరో, దర్శకుడి పరిస్థితి వేరు.
సినిమా తీసినంతకాలం.. వందమందికి పనిచ్చిన దర్శకుడు.. పని కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. చలువ కళ్లద్దాలతో కళకళలాడుతూ తిరిగిన హీరో నిరాశ, నిస్పృహలతో ఇండస్ట్రీని వీడలేక, వేరొక పని చెయ్యలేక వేదన పడాలి. అసలు ఎన్నో ఆశలతో సినిమా తీసి అది ఆడకపోతే వీరిద్దరి పరిస్థితి ఏంటనేది మిలియన్ డాలర్ ప్రశ్న. సినిమా కష్టాలను నిజ జీవితంలోనూ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ వారిని పట్టించుకునేదెవరు? కనీసం ఫలానా వ్యక్తి ఉన్నాడా? అనైనా ఆరా తీస్తారా? అంటే ఎవరూ పట్టించుకోరు. అసలు అవసరం కూడా లేదు. నీ వ్యక్తిగత ఐడెంటిటీ కోసం నీవు పడే తపన మాత్రమే సినిమా. ఎవరైనా వెదికేది వజ్రం కోసమే తప్ప రంగు రాళ్ల కోసం కాదు కదా. వజ్రంలా మెరిస్తేనే ఇండస్ట్రీలో ఒక విలువ, గౌరవం. నిన్ను నువ్వు నిరూపించుకోగలిగితే పున్నమినాటి చంద్రుడిలా వెలిగిపోతావు. లేదంటే అమావాస్య చందమామలా మబ్బుల మాటున మసకబారిపోతావు. ఇది ఒక్కరి కోసం మాత్రమే చెబుతున్న మాట కాదు.. సినిమా కోసం కలలుగని.. తపించి.. సాకారం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమించే వారి కోసం చెబుతున్న మాట. ప్రతి శుక్రవారం ఒక సినిమా చూశాక ఆ సినిమా మెచ్చేలా ఉంటే ఓకే. లేదంటే వారి భవిష్యత్ ఒక్కసారి కళ్లముందు కనిపించి గుండె పడే వేదన గురించి చెబుతున్న మాట. దర్శకులు, హీరోలు, ముఖ్యంగా సినిమా బాగుంటేనే మేమూ బాగుంటాం. కాబట్టి మీరంతా బాగుండాలని చిన్న కోరిక.. చిరు తపన.
Tagtelugu.com అందరూ ఓ వెలుగు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆర్టికల్‌ను ప్రచరిస్తోంది.
ప్రజావాణి చీదిరాల