కుటుంబ పరిస్థితులేమీ అర్థం చేసుకోలేని చిన్ని మనసు ఆ చిన్నారిది.. రెక్కల కష్టాన్నే నమ్ముకుని బతుకుతున్న తండ్రి.. మధ్యతరగతి జీవితం.. స్నేహితురాలి కాలి పట్టీలను చూసి తనకూ కావాలని తండ్రిని అడుగుతుంది.. తన కూతురి కోరికను కాదనలేని తండ్రి సరేనంటాడు. విధి అనేది ఒకటి ఉంటుందిగా.. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అది జీవితమెలా అవుతుంది? పెద్ద ఝలక్కే ఇచ్చింది. మరి ఆ తండ్రి తన ముద్దుల కూతురి కోరికను తీర్చాడా? విధిరాతను తన చిన్ని కూతురికి చెప్పి ఒప్పించాడా? తెలియాలంటే.. ఈటీవీ విన్‌లో ప్రసారమవుతున్న ‘వెండి పట్టీలు’ చూడాల్సిందే. వీరబాబు, సీత దంపతుల ముద్దుల కూతురు బుజ్జమ్మ. ఈ చిన్ని కలతలు లేని కుటుంబంలో అకాల వర్షం పెను విషాదాన్నే నింపింది. ప్రతి మధ్యతరగతి జీవితాన్ని ఈ ‘వెండి పట్టీలు’ ప్రతిబింబిస్తుంది.
ఒక చిన్న కోరిక కోరినా తీర్చలేక బాధపడే తల్లిదండ్రుల దుస్థితికి ఇది అద్దం పడుతుంది. ప్రతి ఒక్కరికీ ఈ మట్టి కథ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. మన కోసం తల్లిదండ్రులు పడిన కష్టాన్ని.. మనం తెలిసీ తెలియక ఏదైనా కోరిక కోరితే తీర్చలేక వారు పడే వేదనను కళ్లకు కడుతుంది. చిన్నపిల్లే కదా.. నచ్చజెప్పడమో.. అదీ కాదంటే రెండు దెబ్బలేసి ఊరుకోబెట్టే మనస్తత్వం కాదు ఈ కథలోని తండ్రిది. రైతుల సమస్యలు, మధ్యతరగతి వ్యక్తుల జీవితాలు అన్నీ ఈ మట్టి కథ మనకు చూపిస్తుంది. రైతే రాజు అంటారు కదా.. ఆ లెక్కన తను రాణినని మురిసిపోయే సీత. ఎంత మంచి స్ఫూర్తిదాయకమైన కుటుంబం. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ 34 నిమిషాల కథ ప్రతి ఒక్కరినీ 30 ఏళ్ల వెనక్కి లాక్కెళ్లి అప్పట్లో జరిగిన విషయాలను గుర్తు చేస్తుంది.
ప్రజావాణి చీదిరాల