ఒక అద్భుతమైన సినిమాకు గౌరవం ఎప్పుడూ ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు సమ్‌థింగ్ స్పెషల్. అలాంటిదే ‘అనగనగా’. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాల మధ్యలో విద్యార్థులు ఎంతగా నలిగిపోతున్నారనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. వాస్తవానికి ‘తారే జమీన్ పర్’, ‘త్రీ ఇడియట్స్’ చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయినా కూడా మన నేటివిటీకి తగ్గట్టుగా ‘అనగనగా’ సినిమాను అద్భుతంగా మలిచి ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు దర్శకుడు సన్నీ సంజయ్ తీసుకొచ్చారు. ఒక సినిమా నేరుగా ఓటీటీలో విడుదలవడం సర్వసాధారణమే. అక్కడ మంచి సక్సెస్ సాధించి.. విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న మీదట.. థియేటర్స్‌కి రావడం అనేది అరుదు అనే కన్నా అసలు జరగలేదని చెప్పడం సమంజసమేమో. ఈ చిత్రం ప్రప్రథమంగా అలాంటి గౌరవాన్ని దక్కించుకుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ జీవితానికి సంబంధించిన ఏదో ఒక విషయం గుర్తుకు రావడం ఖాయం.
చదువు అనేది ప్రతి ఒక్కరికీ అత్యంత ఉపయోగమే.. కానీ చదివించే విధానమే రాంగ్. కొందరు తల్లిదండ్రులకు మాత్రమే ఈ విషయంలో అవగాహన ఉంటుంది కానీ 90 శాతం మంది తల్లిదండ్రులకు పిల్లల ర్యాంకులే వారి తెలివిని డిసైడ్ చేసే కొలమానాలు. పిల్లలకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ర్యాంకులు రాలేదంటే.. వారొక పనికి మాలిన వారి కింద లెక్కేస్తారు. ఇక పాఠశాలలైతే బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తాయి. పిల్లలకు తాము చెప్పే చదువు ఎంతమేర అర్థమవుతుందనేది వారికి అనవసరం. లక్షల్లో ఫీజులు.. చిన్నారుల ఆలోచనలకు మించిన పాఠ్యాంశాలు.. మొత్తంగా చిన్నారులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇదే అంశాలను కథాంశంగా తీసుకుని ‘అనగనగా’ సినిమాను సన్నీ సంజయ్ తెరకెక్కించారు. అలాగే తండ్రీకొడుకుల బంధాన్నిసైతం అద్భుతంగా చూపించారు. చివరకు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించారు. వ్యాస్ (సుమంత్) పాత్రలో సుమంత్ జీవించారు. చిన్నారులకు అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుని పాత్రలో నటించాడు. బట్టీ చదువుల కారణంగా పరీక్షల్లో పాసైనా.. జీవితంలో ఫెయిల్ అవుతారనేది వ్యాస్ భావన. వ్యాస్ భార్య భాగ్య పాత్రలో కాజల్ చౌదరి నటించింది. ఈ సినిమా చూసిన ప్రతీఒక్కరికీ భాగ్యపై చాలా కోపం వస్తుంది. ఆమె తన పాత్రలో అంత అద్భుతంగా నటించింది. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
ప్రజావాణి చీదిరాల