పహల్గాం ఘటనతో పాటు దాని తర్వాత తనపై జరుగుతున్న ప్రచారంపై ప్రభాస్ ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ స్పందించింది. ఇమాన్వి తండ్రి పాకిస్తానీ సైనికాధికారి అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. తాను లాస్ ఏంజిలిస్‌లో పుట్టానని స్పష్టం చేసింది. తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ‘‘పహల్గాంలో జరిగిన ఘటన నా హృదయాన్ని కలచివేసింది. మరణించిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు తమ ఆప్తులను కోల్పోయిన వారి గురించి తెలిసి హృదయం ద్రవించింది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఇలాంటి హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.
ఇలాంటి ఘటనలపై అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు నా గురించి, నా కుటుంబం గురించి ఆన్‌లైన్‌లో జరుగుతున్న అబద్ధపు ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నా కుటుంబంలో పాకిస్తానీ మిలటరీతో ఇప్పటి వరకూ ఎవరికీ ఎలాంటి సంబంధమూ లేదు. ముఖ్యంగా వార్తా సంస్థలు, జర్నలిస్టులు, సోషల్ మీడియా సైతం ఈ విషయాలపై ఎలాంటి పరిశోధనా జరపకుండా ఊహాగానాలను రిపీటెడ్‌గా ప్రసారం చేయడం నన్ను మరింత నిరుత్సాహానికి గురి చేసింది. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలితే భారతీయ సంతతికి చెందిన అమ్మాయినని గర్వంగా చెబుతున్నా.
నేను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించాను. నా తల్లిదండ్రులు యునైటెడ్ స్టేట్స్‌కు చట్టబద్దంగానే వలస వచ్చి అమెరికా పౌరసత్వం స్వీకరించారు. నేను యూనివర్సిటీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్‌గా డ్యాన్సర్‌గా కెరీర్‌ను ఎంచుకున్నా. ఈ రంగంలో చాలా కాలం పని చేసిన మీదట భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశం అందుకున్నా. ఈ ఫిలిం ఇండస్ట్రీ నా జీవితంపై ప్రభావాన్ని చూపింది. నా రక్తంలో పాతుకుపోయిన భారతీయ గుర్తింపు, సంస్కృతిని ఒక విభజన కోసం కాకుండా ఐక్యతకు వినియోగించాలనుకుంటున్నా. ఇలాంటి విషాదకర ఘటనలు జరిగినప్పుడు ద్వేషాన్ని కాదు.. ప్రేమను వ్యాప్తి చేయండి’’ అని పిలుపునిచ్చింది.
ప్రజావాణి చీదిరాల