Jack Review: ‘జాక్’ ప్రేక్షకులను మెప్పించాడా?

విడుదల తేది– 10-04-2025
నటీనటులు– సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు
ఎడిటర్‌– నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ– విజయ్ కే చక్రవర్తి
సంగీతం– సురేష్ బొబ్బిలి, రధన్, అచ్చు రాజమణి,
నిర్మాత– BVSN బాపినీడు
దర్శకత్వం– బొమ్మరిల్లు భాస్కర్

స్టార్‌ బాయ్‌ సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవీ చైతన్య జంటగా నటించిన చిత్రం ‘జాక్‌’. ‘బొమ్మరిల్లు’ ఫేమ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చితాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రం నేడు(ఏప్రిల్‌ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దు ప్రస్తుతం మాంచి ఫామ్‌లో ఉన్నాడు.. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో సాధారణంగానే సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? చూద్దాం..

కథ: మనిషి ఏదైనా రంగంలో నిష్ణాతుడు అవడానికి ట్రైనింగ్ ఏమీ అక్కర్లేదు. ఆ రంగంపై ఆసక్తి ఉంటే చాలు ఏదైనా సాధ్యమేనని కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్‌తో సినిమా ప్రారంభమవుతుంది. కథలోకి వెళితే. జాక్ (సిద్దు జొన్నలగడ్డ)కు చిన్నతనంలో తనకు ఏ ఆట కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తే దానికి ట్రైనింగ్ ఇప్పించే తండ్రి.. ట్రైనింగ్ ఇవ్వలేక చేతులెత్తేసే ట్రైనర్. అలా 20 ఆటలు.. 20 మంది ట్రైనర్లు జాక్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నించి విఫలమవుతారు. అయితే జాక్ టెర్రరిస్ట్ దాడిలో తల్లిని కోల్పోతాడు. దీంతో అలాంటి ఎటాక్స్ జరుగకుండా.. ముందుగానే కనిపెట్టి మట్టుబెట్టేందుకు ‘రా’లో జాయిన్ అవ్వాలనకుంటాడు. దీనికోసం తనను తాను ఒక వెపన్‌లా తయారు చేసుకుంటాడు. ఈ క్రమంలోనే దేశంలో జరగబోయే టెర్రరిస్ట్ ఎటాక్‌ను అడ్డుకునేందుకు ‘రా’ ఒకవైపు.. జాక్ ఒకవైపు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ తరువాత ఏం జరిగింది? టెర్రిరిస్టులను జాక్ ఎలా కనిపెట్టాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటి? అనేది కథ.

నటీనటుల పనితీరు: హీరోయిన్ వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఒక డిటెక్టివ్‌గా చేసింది. తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. స్టార్ బాయ్ సిద్ధు నటనలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. టిల్లుని చూస్తున్నట్టే అనిపించింది. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే తన పాత్రలో జీవించేశారు. చాలా కాలం తర్వాత ఆయనకు తెలుగు సినిమాలో ఒక మంచి పాత్ర దొరికిందనే చెప్పాలి. ఇక నరేష్, సుబ్బరాజు తదితరులంతా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నికల్ విభాగం: ముగ్గురు సంగీత దర్శకులు పని చేసినా పాటలు సోసో గానే ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్, నవీన్ నూలీ ఎడిటింగ్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌: మంచి కాన్సెప్ట్, నటీనటుల పనితీరు.

మైనస్‌ పాయింట్స్‌: కథలో సాగదీత, అనుకున్న కాన్సెప్ట్‌ను ప్రెజెంట్ చేయడంలో బొమ్మరిల్లు భాస్కర్ పూర్తిగా విఫలమయ్యారు. ఒక స్పై యాక్షన్ కథ.. కానీ స్పై మూమెంట్స్ ఎక్కడా కనిపించలేదు. ‘రా’ అంశాన్ని తీసుకున్నప్పుడు ట్విస్ట్‌లు ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ అలాంటి ట్విస్ట్ ఎక్కడా కనిపించదు. కనీసం ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆహా అనుకునేలా ఉండదు. కథలో ఎక్కడా కూడా సీరియస్‌నెస్ కనిపించదు. పోనీ ప్రేక్షకుడిని హాయిగా నవ్వించిందా? అంటే అది కూడా లేదు.

ఫైనల్‌ వర్డిక్ట్‌:  ‘రా’కు ఓకే ఏమో కానీ.. ప్రేక్షకుడిని మాత్రం మెప్పించలేకపోయాడు.

రేటింగ్: 2/5

శివ మల్లాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *