కొత్త సినిమా చిత్రీకరణలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కు గాయాలు…

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కొంత విరామ తర్వాత వరుస సినిమాలకు సంతకాలు చేశారు. ఓ వైపు కథానాయకుడిగా నటిస్తూ, మరో వైపు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. నవంబర్ 25న కొత్త సినిమా చిత్రీకరణలో ఆయనకు గాయాలు అయ్యాయి. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా కాలికి గాయాలు అయ్యాయి.

యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… రాజశేఖర్ కుడి కాలికి బలమైన గాయాలు అయ్యాయి. మడమ దగ్గర పెద్ద ఇంజ్యూరీ అయినట్టు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటిన యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. సుమారు మూడు గంటల పాటు సర్జరీ జరిగింది.

బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి మూడు గంటలు పట్టిందని సమాచారం. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ & వైర్ అమర్చారు. దీని వల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నొప్పి భరిస్తూ రాజశేఖర్ సర్జరీ చేయించుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారు.

సర్జరీ తర్వాత మూడు నుంచి నాలుగు వారాల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని రాజశేఖర్ కు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా గాయమైన కాలిని ఎట్టిపరిస్థితుల్లోనూ కడపకూడదని చెప్పారు. అందువల్ల కొన్ని రోజుల పాటు ఆయన చిత్రీకరణలకు దూరంగా ఉంటారు. జనవరి 2026 లో మళ్ళీ షూటింగ్ ప్రారంభించవచ్చు.

రాజశేఖర్ కు ఈ విధంగా గాయాలు కావడం మొదటిసారి కాదు. నవంబర్ 15, 1989లో ‘మగాడు’ షూటింగ్ చేస్తున్న సమయంలోనూ ఆయనకు గాయమైంది. అప్పుడు ఎడమ కాలికి గాయమైతే, ఇప్పుడు కుడి కాలికి గాయమైంది. ఇప్పుడు 35 ఏళ్ళ తర్వాత నవంబర్ నెలలో మళ్ళీ ఆయనకు గాయమైంది. గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్షన్ సీన్లు చేస్తున్నారు.

రాజశేఖర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘బైకర్’. అది కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాల టైటిల్స్ ఖరారు చేయలేదు. రికవరీ తర్వాత ఆ రెండు సినిమాల చిత్రీకరణలు మొదలు అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *