అమెరికాలో అత్యంత వైభవంగా ‘నాట్స్ 2025’ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి కొందరు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో విక్టరీ వెంకటేశ్ ఒకరు. ఆయన ఈ సందర్భంగా తన సినిమాల గురించి మాట్లాడారు. చిరంజీవి సినిమాలో వెంకీ అతిథి పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలొచ్చాయి. దానిలో నిజమెంతో తెలియక చాలా మంది సందిగ్దంలో ఉండిపోయారు. దీనిపై తాజాగా వెంకీ క్లారిటీ ఇచ్చారు. సినిమాలో నటిస్తున్నానని మాత్రమే కాకుండా.. చిరు గురించి సైతం చాలా గొప్పగా చెప్పారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నానని.. మీనాతో కలిసి ‘దృశ్యం 3’సినిమాలో నటిస్తున్నానని వెల్లడించారు.
అలాగే చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నట్టు వెంకీ వెల్లడించారు. చిరు సినిమాలో తన పాత్ర చాలా ఫన్నీగా ఉంటూ నవ్వులు పంచుతుందని తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడితో కలిసి హిట్ కొట్టానని.. తిరిగి వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా రాబోతున్నట్టు వెల్లడించారు. వీటిన్నింటి కంటే మించి మరో భారీ ప్రాజెక్టులో తన స్నేహితుడితో కలిసి నటించబోతున్నానని.. ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ అని వెంకీ తెలిపారు. అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. మంచి ఎమోషన్స్‌తో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో చిరు తన ఒరిజినల్ పేరైన శివశంకర వరప్రసాద్‌గా మెప్పించనున్నారు.