మంచి లైఫ్ కావాలంటే మన సంతోషాలను, స్నేహితులను అవసరమైతే కుటుంబానికి సైతం దూరంగా ఉండాల్సిందే. అయితే లైఫ్‌లో ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే మనకంటూ ఏమీ ఉండదు. ప్రస్తుతం హీరోయిన్ రష్మిక మందన్నా సైతం తన జీవితాన్ని వెనుదిరిగి చూసుకుని బాధ పడుతోంది. తాజాగా దీని గురించి రష్మిక చెప్పిన విషయాలను చూద్దాం. రష్మికకు ఒక చెల్లి ఉందట. ఆమె కంటే 16 ఏళ్లు చిన్నదట. ప్రస్తుతం ఆమె 13 ఏళ్లు ఉంటాయని.. తన కెరీర్ ఆరంభమైన నాటి నుంచి దాదాపు ఎనిమిదేళ్లుగా చెల్లితో గడిపే సమయమే దొరకలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు తన చెల్లి తన హైట్‌కు వచ్చేసిందని.. తన ప్రయాణంలో ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే తనేం మిస్ అవుతున్నానో తనకు అర్థమైందంటూ చెప్పుకొచ్చింది. రష్మిక ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతోందట. ఇక తన స్నేహితులను కలిసి చాలా కాలమవుతోందట. గతంలో వాళ్లు ఎటైనా వెళ్లాలని ప్లాన్ చేస్తే తనను పిలిచేవారట. కానీ తనకు టైం సెట్ అవక వెళ్లలేకపోయేదట. క్రమంగా వాళ్లు తనను పిలవడం కూడా మానేశారట. ఇవన్నీ గుర్తొస్తే చాలా బాధగా అనిపిస్తుందని.. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేసి మనసు తేలిక చేసుకుంటానని రష్మిక చెప్పుకొచ్చింది. వృత్తిలో రాణించాలంటే జీవితాన్ని త్యాగం చేయాలని.. తన తల్లి తనకు ఎప్పుడూ చెబుతుంటుందని రష్మిక వెల్లడించింది.