నాగవంశీ ఆవేదనలో న్యాయమెంత ?

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇవాళ (మంగళవారం) పెద్ద ఎత్తున కొందరు రివ్యూవర్లపై విరుచుకుపడ్డారు.

తాను సినిమా తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్‌ ఛానల్స్, యూట్యూబ్‌ ఛానల్స్‌ పనిచేస్తాయన్నారు.

తాము ప్రకటనలిస్తే మీ వెబ్‌సైట్స్‌ నడుస్తాయన్నారు.

నాగవంశీ లేదంటే మరొక నిర్మాత పోషిస్తే కానీ నడవలేని స్థితిలో వెబ్‌సైట్స్‌ ఉన్నాయనడం ఎంతవరకూ సబబు? ‘పుష్ప’ సినిమాకు సైతం తొలుత యాంటీ రివ్యూస్‌ వచ్చాయి.

కానీ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. కంటెంట్‌ లేనంత మాత్రాన సినిమా ఆడకపోవడం అంటూ ఏమీ ఉండదు.

స్టార్స్‌లేకున్నా కూడా సినిమా ఆడిన దాఖలాలున్నాయి.

ఉదాహరణల కోసం ఎక్కడో వెదుక్కోవడమెందుకు? ‘మ్యాడ్‌’ చిత్రంలోనూ కథేమీ ఉండదు. ఈ హీరోలే.. ఈ న టీనటులే. అయినా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది.

మరి సీక్వెల్‌ కూడా అంతే కదా. ప్రేక్షకులకు నచ్చితే ఆడుతుంది.

రివ్యూస్‌ యాంటీగా వచ్చాయనో.. ఎవరో ఏదో ట్వీటేశారనో సినిమా ఆడకపోవడమంటూ ఏమీ ఉండదు కదా. ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలు.

మౌత్‌ టాక్‌ను మించిన పబ్లిసిటి ఏముంటుంది? సినిమా బాగుందంటే పక్కాగా మౌత్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది.

అంత పెద్ద నిర్మాత ఇంత చిన్న విషయాన్ని మరువడమేంటి? ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ వెబ్‌సైట్, యూట్యూబ్‌ ఛానళ్లను రేవు పెట్టడమెందుకు?

మాట్లాడే విధానంలో అంత వెటకారమెందుకు? ‘సినిమాలు ఆడితేనే మీరుంటారు.. లేకపోతే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది.

గుర్తు పెట్టుకుని ప్రవర్తించండి’ అంటే అది ఇరువురికీ వర్తిస్తుంది కదా.. హెచ్చరికలెందుకు? ‘మీరూ, మేము కలిసి పని చేయాలి’ అనుకున్నప్పుడు డీల్‌ చేసే విధానం వేరేగా ఉంటుంది.

రూపాయికి మరో కోణం ఏంటంటే..

ఇప్పటి వరకూ చెప్పింది రూపాయికి ఒక కోణం మాత్రమే. మరో కోణం కూడా ఉంటుంది. అదేంటో చూద్దాం.

ఒక సినిమా ఆర్టికల్‌ కోసం వేలల్లో రూపాయలు దండుకుంటున్న మీడియా సంస్థలు, దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు.

నోటు కనిపిస్తే కానీ పెన్ను కదలదు. కనిపిస్తే ఒకలా.. కనిపించకుంటే మరోలా.. ఆర్టికల్‌ పడుతుంది. ఇదెక్కడి న్యాయం.

నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన మీడియా డబ్బే ధ్యేయంగా.. అదే పరమార్థంగా వ్యవహరిస్తోంది. ఒక సినిమాపై కొన్ని వేల మంది భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది.

రూపాయి నోటు కోసం వారి భవిష్యత్‌ను కాలరాసే రైట్‌ ఈ సోకాల్డ్‌ మీడియా సంస్థలకు ఎవరిచ్చారు?

నాగవంశీ ప్రశ్నించిన దానిలో తప్పేమీ లేదు. ఆయన ఆవేదనలోనూ అర్థముంది.

ఒకరకంగా.. సినిమా రివ్యూ ఇవ్వడం వ్యక్తిగత అభిప్రాయం.

ఆ తర్వాత ట్వీట్స్‌వేసి మరీ సినిమాను చంపేయాలనుకోవడం కక్ష సాధింపు చర్యే కదా?

సినిమా, మీడియా సంస్థలలో ఎవరు గొప్ప? అని ప్రశ్నించడమంటే కోడి ముందా?గుడ్డు ముందా? అని ప్రశ్నించడమే అవుతుంది.

ప్రజావాణి చీదిరాల

Also Read This :డౌట్ ఉంటే చూసుకోండి.. సవాల్ చేస్తున్నా : రివ్యూవర్స్‌పై నాగవంశీ ఫైర్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *