Janasena :
పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వని ఎన్నికల సంఘం
ఏపీలో జనసేన పార్టీకి ఈసీ కేటాయించిన గాజు గ్లాస్ గుర్తుపై నెలకొన్న సందిగ్ధం ఇంకా వీడిపోలేదు. జనసేన పోటీ చేయని స్ధానాల్లో ఇతరులకు సైతం గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈసీ కీలక హామీ ఇచ్చింది. జనసేన చేసిన డిమాండ్లలో ఒక దానికి మాత్రమే ఈసీ అంగీకరించింది. దీంతో ఆ పార్టీకి పాక్షిక ఊరట లభించింది. జనసేనకు గతంలో కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీ పోటీ చేయని స్ధానాల్లో స్వతంత్రులకు, ఇతర పార్టీల అభ్యర్ధులకు కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు దాదాపు 40 చోట్ల నిర్ణయాలు తీసుకున్నారు.దీనిపై జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తమకు తప్ప ఎవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించవద్దని కోరారు. దీనిపై హైకోర్టు ఈసీ అభిప్రాయం కోరింది. దీంతో స్పందించిన ఈసీ… జనసేన పోటీ చేసే ఎంపీ సీట్లతో పాటు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లలో ఇతర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించకుండా చూస్తామని హామీ ఇచ్చింది. అయితే జనసేన పోటీ చేయకుండా, కూటమిలో ఇతర అభ్యర్ధులు పోటీ చేస్తున్న స్ధానాల్లో గాజు గ్లాసు గుర్తు ఇవ్వకుండా అడ్డుకుంటామని మాత్రం ఈసీ చెప్పలేదు. దీంతో ఈ విషయంలో సందిగ్ధం నెలకొంది. వాస్తవానికి జనసేన పోటీ చేయని స్దానాల్లో కూటమి అభ్యర్ధులు పోటీ చేస్తుండటం, అక్కడ ఓటర్లు సందిగ్ధానికి లోనయ్యే అవకాశాలు ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈసీ మాత్రం 24 గంటల్లో సమస్య పరిష్కరిస్తామని హైకోర్టుకు నిన్న హామీ ఇచ్చింది. అన్నట్లుగానే ఇవాళ హైకోర్టుకు తమ అభిప్రాయం చెప్పేసింది. అయితే ఇందులో పూర్తి క్లారిటీ లేకపోవడంతో జనసేన ఏం చేయబోతోందో చూడాలి.
Also Read This Article : రేవంత్ ను అరెస్టు చేస్తారా?
