ఒకప్పటికీ.. ఇప్పటికీ టాలీవుడ్ పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ నుంచి సినిమా అంటే తెలుగు ప్రజలు తప్ప వేరొకరు ఎదురు చూసేవారు కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. దేశమంతా ఎదురు చూస్తోంది. దీంతో టాలీవుడ్‌లో రోజుకో కొత్త ప్రొడక్షన్ కంపెనీ పుట్టుకొస్తోంది. ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ అంటూ ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ రాబోతోంది. గురువారం ఈ కొత్త బ్యానర్ లోగోని అధినేత జేజే విడుదల చేసి మీడియాతో ముచ్చటించారు. అనంతరం మీడియాతో జేజే మాట్లాడారు. తమ లాంటి వారిని టాలీవుడ్ ఎంతో ఘనంగా స్వాగతిస్తోందని అన్నారు.
‘‘టాలీవుడ్‌లోకి నిర్మాతగా వస్తుండటం ఆనందంగా ఉంది. మా లాంటి కొత్త వారిని టాలీవుడ్ ఎంతో ఘనంగా స్వాగతిస్తోంది. ఇక్కడి పెద్దలు మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్‌లో మా సంస్థను రిజిస్టర్ చేశాం. మాకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా సహకారం లభించింది. మా సంస్థ లోగోను నేడు ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. మా సంస్థ లోగోలో చూపించినట్టుగా ఆ వెలుగుని అంతటా పంచాలని ఆశిస్తున్నాం. పరిశ్రమలో పరస్పర సహకారం, ఎదుగుదల అనే కాన్సెప్ట్‌తో ఆ లోగోను డిజైన్ చేయించాం. ఇక్కడ మేం కొత్త వారిని ఎంకరేజ్ చేయడానికి, కొత్త కథల్ని తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తాం. మా ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్‌పై త్వరలో ఒక భారీ సినిమా ప్రారంభం కానుంది. భవిష్యత్తులో ఎన్నో మంచి చిత్రాలను నిర్మించాలన్నదే మా లక్ష్యం’ అని జేజే తెలిపారు.
ప్రజావాణి చీదిరాల