టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని ముందుగానే బీసీసీఐతో పాటు మరికొందరు క్రికెట్ దిగ్గజాలకు చెప్పినట్టు సమాచారం. అయితే బీసీసీఐతో పాటు పలువురు ఆయనను ఇప్పుడే వద్దని వారించారు. అయినా సరే.. కోహ్లీ తన నిర్ణయానికి కట్టుబడి రిటైర్మెంట్ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఒకింత భావోద్వేగానికి గురైనట్టు ఆయన పోస్ట్ ద్వారా తెలుస్తోంది. 14 ఏళ్ల క్రితం తను తొలిసారి క్రికెట్‌లో బ్యాగీ బ్లూ జెర్సీ ధరించానని గుర్తు చేసుకున్నాడు. వాస్తవానికి ఈ పార్మాట్ తనను ఈ స్థాయికి తీసుకొస్తుందని ఏనాడూ ఊహించలేదని.. ఎన్నో క్లిష్టతరమైన సవాళ్లు, విజయాలు తనకెన్నో జీవిత పాఠాలను నేర్పాయన్నాడు.
వైట్ డ్రెస్‌లో ఆడటం ఓ అనుభూతి అని.. ఈ ఫార్మాట్ నుంచి వైదొలగడమనేది తనకు అంత ఈజీ కాదనిపించిదని విరాట్ పేర్కొన్నాడు. అయితే తన రిటైర్మెంట్‌కు ఇది సరైన సమయమని.. తన టెస్ట్ కెరీర్‌లోని ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపాడు. కోహ్లీ ఇప్పటి వరకూ 123 టెస్టులు ఆడి 9230 పరుగులు చేశాడు. వీటిలో ఏడు డబుల్ సెంచరీలు, 30 సెంచరీలు ఉన్నాయి. 68 టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహించి, 40 విజయాలను అందించాడు. మొత్తంగా 58.82 శాతం సక్సెస్ రేటుతో భారతదేశం గర్వించదిగన సక్సెస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. అయితే టెస్ట్ క్రికెట్‌కు విరామం ప్రకటించిన కొన్ని నిమిషాల తర్వాత కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. వీరిద్దరూ లండన్ వెళ్లినట్టు తెలుస్తోంది.
ప్రజావాణి చీదిరాల