తెలంగాణ కాంగ్రెస్ లో అప్పుడే అంతర్గత కలహాలు అప్పుడే మొదలయ్యాయా? అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవక ముందే
ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయా? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ విషయంలో చోటుచేసుకుంటున్న
పరిణామాలు ఇది నిజమేనన్న అభిప్రాయాలు కలిగిస్తున్నాయి. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ప్రతిష్ఠాత్మక
ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు రావడం తెలిసిందే. గతంలో కాంగ్రెస్
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశంపై కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికితోడు ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ
కుంగిపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పేట దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలై.. కాంగ్రెస్ ప్రభుత్వం
ఏర్పాటయ్యాక కాళేశ్వరం నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విచారణ జరిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్
ఫోర్సమెంట్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్
కుమార్ రెడ్డికి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో మొదటినుంచీ ఆరోపిస్తూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. దానిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని నిర్ణయించారు. అప్పడే అన్ని వాస్లవాలు వెలుగులోకి వస్తాయని ఆయన భావిస్తున్నారు. ఆ మేరకే విజిలెన్స్ అధికారులకు విచారణకు ఆదేశించారు. కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారం మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాల్సిన అవసరం లేదని, కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ వరకు విచారణ జరిపితే చాలని మంత్రి అంటున్నట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులకు కూడా విచారణను మేడిగడ్డకే పరిమితం చేయాలని చేప్పినట్లు తెలిసింది. కాళేశ్వరం మొత్తం నిర్మాణ వ్యయం రూ.1.27 లక్షల కోట్లయితే.. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందన్నది ఆయన వాదనగా తెలుస్తోంది. పైగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయం బహిరంగంగా కనిపిస్తున్నందున దానిపై విచారణ జరిపితే విషయం వెల్లడవుతుందని అంటున్నట్లు సమాచారం. ఇలా.. అటు సీఎం, ఇటు మంత్రి భిన్నమైన ఆదేశాలు ఇవ్వడంతో విచారణ అధికారులు సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో సీఎం అభిప్రాయానికి భిన్నంగా మంత్రి ఉత్తమ్ ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది ప్రస్తుతానికి అంతుచిక్కని అంశం. అయితే ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ వ్యయం కలిపితేనే రూ.7500 కోట్ల వరకు ఉంటుందని, మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే అయితే.. రూ.3600 కోట్లలోపే ఉంటుందన్నది అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై మాత్రమే విచారణ జరిపితే.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమంతా పారదర్శకంగా జరిగిందని క్లీన్ చిట్ ఇచ్చినట్లే అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ప్రాజెక్టుపై విచారణను అడ్డకునేందుకు ఉత్తమ్ చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉండకపోవచ్చు. మంత్రి ఆదేశాలు ఎలా ఉన్నా.. అధికారులు అంతిమంగా ముఖ్యమంత్రి ఆదేశాలనే పాటిస్తారన్నది తెలిసిందే. దీంతో ఉత్తమ్ ఈ విచారణను ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది సీఎంకు, మంత్రికి మధ్య దూరాన్ని పెంచే అవకాశముందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.