హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటేనే అన్ని విధాలుగా మనం బాగుంటాం. సమస్య ఏదైనా మన అదుపులోనే ఉండాలి. లేదంటే ఇబ్బందుల్లో పడతాం. ముఖ్యంగా బీపీని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే స్ట్రోక్, కిడ్నీ డ్యామేజ్ వంటి సమస్యలకు కారణమవుతుంది. దీనిని అదుపులో ఉంచుకోవాలంటే ఆహారపు అలవాట్లతో పాటు వ్యాయామాలు తప్పనిసరి. రక్తం ప్రసరించే సమయంలో ధమనుల గోడలపై ఒక్కోసారి ప్రెజర్ పెరుగుతుంది. దీనినే బ్లడ్ ప్రెజర్ అని పేర్కొంటారు. బీపీ సాధారణంగా 120/80 ఉండాలని వైద్యులు చెబుతారు. పైన ఉండే 120 నంబర్ వచ్చేసి రక్తాన్ని పంపింగ్ చేసే సమయంలో గుండె ముడుచుకుపోయినప్పుడు రక్తనాళాలపై కలిగే ఒత్తిడిని సూచిస్తుంది. దీనిని సిస్టోలిక్ అంటారు. కింది నంబర్ డయాస్టోలిక్ ప్రెజర్‌గా అభివర్ణిస్తారు.
బీపీ అనేది వయసును బట్టి మారుతూ ఉంటుంది. హైపర్ టెన్షన్ స్టేజ్ 1 వచ్చేసి సిస్టోలిక్ 130-139, డయాస్టోలిక్ 80 – 89 కాగా.. స్టేజ్ 2.. సిస్టోలిక్ 140 లేదా అంతకంటే ఎక్కువ, డయాస్టోలిక్ 90 లేదా అంతకంటే ఎక్కువ. ఇక బీపీ 180/120 దాటిందా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేదంటే పరిస్థితి విషమించి స్ట్రోక్‌కు దారి తీయవచ్చు. అధిక బీపీ వల్ల స్ట్రోక్ ముప్పే ఎక్కువ. బ్రెయిన్‌లో రక్తనాళాలను దెబ్బతీసి ప్రాణాల మీదకు తెస్తుంది. చాలా మంది సిస్టోలిక్ ప్రెజర్‌నే దృష్టిలో పెట్టుకుంటారు కానీ డయాస్టోలిక్‌ను పట్టించుకోరు. ఈ రెండింటిలో ఏది నార్మల్ స్థాయిలో లేకున్నా ప్రమాదమే. కాబట్టి బీపీతో జర జాగ్రత్త.