సుకుమార్ పేరు వినటానికి, పలకటానికి చాలా అందంగా నాజుగ్గా ఉంటుంది. కానీ అతని పేరులో ఉన్న నాజూకుతనం తన సినిమాల్లో ఉండదు. అతనో సినిమా తీవ్రవాది. తను అనుకున్న సినిమా తీయటంకోసం హీరోతోనైనా, నిర్మాతతోనైనా కథకు అడ్డొచ్చే ఎవరితో అయినా గొడవపడ్తాడు. కారణం కంటెంట్ కింగ్‌లా ఉండాలి. ప్రేక్షకుడు తనివితీరా తన సినిమాను ఆస్వాదించాలనే స్వార్థపరుడు సుకుమార్. ఒక దర్శకుడు నిజమైన సినిమా ప్రేమికుడు అయితే ఎలా ఉంటాడో సుకుమార్ అలా ఉంటాడు. అలా అంతలా ఆలోచిస్తాడు. కొందరు దానికి పైత్యం అని పేరు పెడతారు. మరికొందరు దాన్ని ప్యాషన్ అంటారు. ప్రీ–ప్రొడక్షన్‌లో, షూటింగ్‌లో ఎన్ని గొడవలు పడ్డా సినిమా విడుదలైన తర్వాత సినిమా చూసిన ప్రేక్షకుడు మనసులోనే సుకుమార్‌కి ఒక గట్టి హగ్ ఇచ్చేస్తారు ఆడ–మగ తేడా లేకుండా. దటీజ్ సుకుమార్. ఏ వేదికపైనైనా పుంఖాను పుంఖాలుగా మాట్లాడని పిచ్చిమారాజు సుకుమార్. మాటలకంటే చేతలకే విలువెక్కువని నమ్మతాడు. ఆయన ఒక్కో సినిమా విడుదలయినప్పుడల్లా గుంపులు గుంపులుగా థియేటర్‌కి వెళ్లి ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎగబడతారు కదా! అప్పుడు సుకుమార్ మనసు శాంతిస్తుంది. పిచ్చిగా జనం ఎంజాయ్ చేస్తుంటే తెల్లగడ్డం చాటున ఉన్న సుక్కు పెదాలు తెలియకుండా విచ్చుకుని నవ్వుకుంటాయి. ఈ రెండు దశాబ్దాలుగా సుకుమార్‌తో ట్రావెల్ అవుతున్న తన నిర్మాతలు, అసిస్టెంట్స్, మీడియా ఇలా అందరూ తనను గమనిస్తూనే ఉన్నారు. ఓ కంట అతని ఎదుగుదలను చూస్తూనే వీరంతా పెరిగారు. దర్శకుడు అనే చిన్న విత్తనంగా నాటితే ‘ఆర్య’ సినిమాతో ఆ విత్తనం మొక్కగా బతికింది.

‘జగడం’తో ఆటుపోట్లు ఎదుర్కొని అన్నికాలాల్లో ప్రకృతి సహకరించకపోతే ఎలా నిల్చోవాలో ఆ మొక్క నేర్చుకుంది. అంతే ఆ తర్వాత ఆ మొక్క చిన్నసైజు చెట్టుగా మారింది. ఆ చెట్టుక్రింద నీడ పెద్దగా రావటంతో రాళ్లు వేసుకుని సేద తీరే మనుషులు సుక్కు ‘ఆర్య–2’ సినిమా చేస్తే ఈ చెట్టుకు తిరుగులేదు అంటూ చెట్టును ప్రేమించటం మొదలుపెట్టారు. ఆ చెట్టు చుట్టూచేరిన వారికి ‘100 పర్సెంట్ లవ్’ని ఆక్సిజన్‌లా ఇచ్చారు సుక్కు. అప్పటివరకు సినిమా స్టూడెంట్‌లా ఉన్న సుకుమార్ ‘1 నేనొక్కడినే’ సినిమాతో దర్శకునిగా పెద్దగా ప్రమోషన్ వచ్చి సినిమా మేకింగ్‌లో మాస్టర్ అయ్యారు. ఆ సినిమాతో సుకుమార్ మీద ఇండస్ట్రీలో సినిమా మేకింగ్ తెలిసిన ప్రతి ఒక్కరూ సుకుమార్‌లోని లోతును వెతకటం ప్రారంభించారు. కట్‌చేస్తే ప్రతి ఒక్క ప్రేక్షకునికి నాన్నను గుర్తు చేస్తూ ‘నాన్నకు ప్రేమతో’ అంటూ మరో మెట్టెక్కాడు. చెట్టుకు ఏ మందులు వేయకుండానే ఆర్గానిక్‌గా ఎదగటం ప్రారంభించిది. ఆ చెట్టుకొమ్మలు చూడాలంటే 90డిగ్రీస్‌తో తల ఎత్తుకుని చూడాలి. ఇంక ఇంతకంటే చెట్టు ఏం పెరుగుతుందిలే అని అనుకున్నారు చెట్టును చూసిన ప్రతివారు. ‘రంగస్థలం’ సినిమాతో సుకుమార్‌ని రెగ్యులర్‌గా చూసే అందరి కళ్లకు ఏమి అర్థం కాలేదు. అందరూ వారిలోవారే గుసగుసలాడారు. ఏంటి…సుకుమార్ ఇంతలా ఎదిగిపోయాడు. అతని తీత, రాత కాలంతో పాటు అన్ని భలే మారిపోయాయే అని అప్పటినుండి సుకుమార్‌ని పొగడటం మానేశారు ఇండస్ట్రీ అంతా. సినిమా పరిశ్రమకు వద్దామనుకునేవాళ్లకు, సినిమాను పిచ్చిగా ప్రేమించేవాళ్లకు అతనో మ్యాథమేటిక్స్ మ్యాస్ట్రోలా స్టోరీటెల్లింగ్‌లో మాస్టర్‌లా కనిపించటం మొదలుపెట్టారు. అప్పటివరకు చిత్ర పరిశ్రమలోని దర్శకులు, హీరోలు, నిర్మాతలు సుకుమార్ కనిపించగానే నువ్వు సినిమా జీనియస్ ఆ సీన్ సూపర్‌గా రాశావు, ఈ సీన్ సూపర్‌గా తీశావు అనేవాళ్లంతా. అలాంటి వాళ్లందరూ సడెన్‌గా సైలెంటయ్యారు, మాయమయ్యారు. ‘రంగస్థలం’ సినిమా విడుదలైన తర్వాత నుండి తన ఫోటోను స్క్రీన్‌సేవర్‌గా పెట్టుకోవటం మొదలుపెట్టారు సినిమాను తీయటం తెలిసినవారంతా. అంతకంటే సక్సెస్ ఏముంటుంది అనుకుని సుకుమార్‌ని మనసులోనే ముద్దాడారు సినీ ప్రేమికులు.
‘పుష్ప’ సినిమా విడుదలయ్యింది. సినిమా చూసినవారంతా ముక్కున వేలేసుకుని విడ్డూరం చూసినట్లు ఇలాంటి కంటెంట్‌తో వచ్చిన సినిమాను ఇంత బాగా తీయొచ్చా? అనుకుని సుకుమార్‌ని మనసులోని అయ్యబాబోయ్ వీడేం మనిషి సినిమాను ఇంత బాగా తీశాడు అనుకున్నారు. చెట్టుక్రింద రచ్చబండ దగ్గర కూర్చున్నవారంతా మా సుకుమార్ మన సుక్కూ ఎంతో ఎదిగిపోయాడని పైకి చూశారు. ఎక్కడాకూడా చెట్టు చిటారు కొమ్మలు కనిపించలేదు. కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నాయా..అన్నట్లుగా ఆ చెట్టు పెరిగింది. మరో మూడేళ్ల కష్టంతో ‘పుష్ప–2’ అంటూ సుకుమార్ మరోసారి ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఆ సినిమా చూసిన ప్రపంచంలోని ప్రేక్షకులంతా సుకుమార్ అనే చెట్టును చూద్దామని వచ్చారు. ఆ చెట్టు మొదలు మాత్రమే కనిపిస్తుంది. ఆ చెట్టు పెరిగి పెరిగి ఆకాశమంత అయ్యింది. అతనికి చాలా బాగా సినిమా తీశావు అని అందరూ చెప్తున్నా కూడా ఆ మాటలు చెట్టుపైన చిటారు కొమ్మల్లో ఉన్న సుక్కుకి వినిపించటంలేదు. కారణం ఆ డిసిబెల్ సౌండ్ అందుకోలేనంత ఎత్తుకు సుక్కు ఎదిగాడు. ఆ చెట్టుకు కాసే 24రకాల పండ్లను ప్రేక్షకుల మీద ప్రేమతో ఎంతో రుచిగా సెల్యులాయిడ్‌పై పరిచి కలర్‌ఫుల్‌గా డెకరేట్ చేసి ఎప్పటికప్పుడు సినిమా ప్రేమికులకు అందిస్తాడు సుకుమార్. అందుకే సుక్కు నువ్వు మార్ (కొట్టు) నీ వెనక మేమంతా ఉన్నాం అంటూ సుకుమారుని కోసం ప్రేమించి తను ఎప్పుడూ హ్యాపిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. జనవరి 11 సుకుమార్ జన్మదినం. 55 ఏళ్ల సుకుమారుడు 26 ఏళ్ల సినిమావాడు 21ఏళ్ల దర్శకుడు సుకుమార్ జన్మదినం సందర్భంగా ఆయన్ని విష్ చేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్ అండ్ టీమ్.
ప్రేమతో… శివమల్లాల
Also read this : రివ్యూ–గేమ్ ఛేంజర్
