నటి శ్రుతిహాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా ఏమాత్రం సంకోచించకుండా సమాధానం ఇస్తుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా ఆసక్తికర విషయాలను ఆమె పంచుకుంది. కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాలు, రిలేషన్‌పిప్ వ్యవహారాలన్నింటిపై స్పందించింది. జీవితంలో తను చేసిన పనులకు బాధపడిన సందర్భాలు ఎప్పుడూ పెద్దగా లేవని తేల్చేసింది. ‘‘జీవితంలో ఇలాంటి పని ఎందుకు చేశానా.. అని బాధపడిన సందర్భాలైతే పెద్దగా ఏం లేవు కానీ నాకెంతో ఇష్టమైన వారిని మాత్రం కొన్నిసార్లు బాధపెట్టా. కావాలని చేయలేదు కానీ అలా చేయకుండా ఉండాల్సిందని ఎప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. వారికి జీవితాంతాం సారీ చెబుతూనే ఉంటా. అందరి ప్రేమలూ సక్సెస్ కావు. ప్రతిఒక్కరి జీవితంలో లవ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది.
మాజీ భాగస్వామి కారణంగా మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. నా జీవితంలోననూ బ్రేకప్ స్టోరీలున్నాయి కానీ ఎక్కువగా ఆలోచించను. చాలా మంది నా లవ్‌స్టోరీల గురించి మాట్లాడటమే కాకుండా ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్?’ అని కూడా అడుగుతుంటారు. వారి దృష్టిలో అదొక నంబర్ మాత్రమే.. కానీ నా దృష్టిలో కోరుకున్న ప్రేమను అన్నిసార్లు విఫలమయ్యానని అర్థం. నేను మనిషినే కదా.. అది నన్నెంతో బాధ పెడుతూ ఉంటుంది. కెరీర్ ఆరంభంలో నా సినిమాలు చాలా ఫెయిల్ అయ్యాయి. తెలుగులో ‘గబ్బర్‌సింగ్’కు ముందు నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో నాకు ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఈ రెండు చిత్రాల్లో హీరో అయిన సిద్దార్థ్‌ను మాత్రం ఎవరూ ఏమీ అనలేదు. దర్శకుడు హరీశ్ శంకర్ ‘గబ్బర్ సింగ్’తో నా కెరీర్ మారింది. విజయాన్ని అందుకోవడం వరుసగా అవకాశాలు వచ్చాయి’’ అని తెలిపింది.