అలో అలో అలో…సెగటరీ మన సినిమా ‘ముత్యాలముగ్గు’ సినిమా విడుదలై అప్పుడే 50 ఏళ్లయిందా? మొన్నీ మధ్యనే వచ్చినట్లుంది అనిపిస్తుంది అని తన పక్కనే ఉన్న అల్లు రామలింగయ్య గారితో స్వర్గంలో ఉన్న రావుగోపాలరావుగారు మాటా మంతీ కలిపారు. రావుగారు మాట్లాడుతూ దీని తస్సరవల బొడ్డు తన రైటింగ్‌తో సినిమాకు అందమైన వజ్రాల్లాంటి మాటలను పొదిగిన మన బాపు–రవణలో రవణ గుర్తున్నాడా జోగినాథం ( అల్లు రామలింగయ్య గారి ముత్యాలముగ్గు పాత్ర పేరు) అనగనే ఆయన్నెలా మరిచిపోతానండి…అవును అని ఊ..కొట్టారు మన అల్లుగారు. ఆ చిత్రంలో కీలకమైన మాటలను అందించిన మన వెంకటరమణగారి 94వ (మనం ఆయనతో కలిసి పనిచేసినపుడు 44 ఏళ్లు రవణకి) పుట్టినరోజు సందర్భంగా వారబ్బాయి ముళ్లపూడి వర హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్ ప్రీవ్యూ థియేటర్లో షో వేసి మన వారందరిని పిలిచారట…అవునా కాంట్రాక్టర్‌గారు (సినిమాలో రావుగోపాల్ రావుగారు కాంట్రాక్టర్) …..అని అల్లు గారనగానే….ఊ..ఊ నీతో ఇదే మరి గొడవ…ఆ..ఆఆ…ఆఆ అంటే మనవాళ్లు అంటే మా అబ్బాయి కూడా వచ్చాడా అండి అని అడుగుతున్నా కాంట్రాక్టర్‌గారు మీరు కోప్పడకండి….రావటమేంటి మీవాడు అల్లు అరవింద్ మావాడు రమేశ్ సినిమాకి వచ్చి పెద్ద పండగలా ఫీలవుతేను… సినిమా 50 ఏళ్లు పూర్తయ్యాయి అని మనందరిని ఓ సారి గుర్తు చేసుకుందామని కాపీకూడా మళ్లీ 4కేలో చేయించి మరి ఈ తరానికి తగ్గట్లుగా తయారుచేశారట రవణ వాళ్లబ్బాయి. మీ వాడితో పాటు మావాడు మన ముత్యాలముగ్గుతో ఎనలేని పేరు తెచ్చుకున్న మన హీరోయిన్ సంగీత కూడా ఆ ప్రీవ్యూకి హాజరయ్యింది. ఆ షో చూసిన తర్వాత మనందరి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతుంటే మళ్లీ భూమ్మీదకి వెళ్లిపోదామా అనిపించింది కానీ..మనతో పాటే మన చిత్ర దర్శకులు బాపుగారు అయన స్నేహితులు రమణగారు కూడా ఇక్కడే ఉన్నారు కదా ఎందుకులే అని ఆగిపోయాను. పోనీ వారిని కూడా ఓ సారి వెళ్లొద్దామా అని అడిగితే బాపూగారేమో రమణ గారి వంక చూస్తారు…రమణ గారేమో ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. దేనికి సమాధానం చెప్పరు. వీరు అప్పటినుండి అలానే ఉన్నారు. వారికి వారు తప్ప మరొకరికి అర్థమయ్యే సమస్యేలేదు… అదేమంటే మనపిల్లలంతా ఎంజాయ్ చేస్తూ మనగురించి పండగలా ప్రీవ్యూ వేశారుకదా రావుగారు…ఇది చాల్లేండి అంటూ నవ్వుతూ చెప్తారు ఒకరు. అది కరెక్టే కాదా అంటూ మన సినిమాల రూపంలో మన తెలుగు వాళ్లందరికి మనం ఇంకా గుర్తున్నాం రావుగారు చాల్లే అంటూ సెలవు తీసుకున్నారు ఇంకొకరు. చేసేదేమి లేక నా గోడు నీకు వెళ్లబోసుకుంటున్నాను సెగటరీ…నీకు ఏ విషయం ఓ పట్టాన ఆర్థమై చావదు అంటూ ఇంద్రసభకు థీమాగా నడుచుకుంటూ వెళ్లిపోయారు రావుగోపాలరావుగారు. స్వర్గంలో కూడా నన్ను వదిలిపెట్టకుండా తిరుగుతూ తన సెక్రటరీ అనుకుంటున్నాడు అని రావుగోపాల్ రావుగారిని సరదాగా తిట్టుకుంటూ..నవ్వుకుంటూ అలా హాయిగా నవ్వుతూ వెళ్లిపోయారు అల్లు రామలింగయ్యగారు….
అర్థమైందిగా ‘ముత్యాలముగ్గు’ సినిమాను 4కే లోకి మార్చి అప్పటి నటీనటులను వారి కుటుంబ సభ్యులను పిలిచి తన స్నేహితులు బ్నిం, వేగిరాజు సుబ్బరాజు గార్లతో కలిసి ఓ వేడుకలా ఎంతో గౌరవంగా తన తండ్రిగారైన ముళ్లపూడి వెంకటరమణగారి 94వ జయంతిని నిర్వహించారు ముళ్లపూడి వరగారు. ఈ ప్రివ్యూ షో పూర్తయిన తర్వాత అల్లు అరవింద్‌గారు, రావురమేశ్‌గారు, రఘురామ కృష్ణంరాజు, ముత్యాలముగ్గు నటీమణి సంగీత గారు తదితరులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు…..ట్యాగ్‌తెలుగు.కామ్ ముళ్లపూడి వారి జయంతి సందర్భంగా సమర్పించిన చిరు కానుక ఈ నాలుగక్షరాలు..
శివమల్లాల
Also Read This :కమర్షియల్ బ్లాక్‌బస్టర్ అనే మాటకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ దర్శకుడు…