దేశంపై ప్రేమ ప్రతి ఒక్కరికీ ఉంటుంది కానీ దానిని ఎలా చూపించుకోవాలో పెద్దగా తెలియదు. ఇటీవల కశ్మీర్‌లో మన దేశ పౌరులపై జరిగిన దాడికి మన దేశం ‘ఆపరేషన్ సింధూర్’ పేరట గట్టిగానే బదులిచ్చింది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి ఓ పాట రూపంలో తన దేశభక్తిని చూపారు.
ప్రసాద్ రచించిన ఈ పాటకు రమేష్ సంగీతాన్ని అందించగా కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఉమా శంకర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు మనికంఠ ఎడిటింగ్ చేయగా సత్య శ్రీనివాస్ గారు సంగీత సహకారాన్ని అందించారు. లక్ష్మణ్ పూడి ఈ పాటకు స్వరాన్ని జోడించి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి జేడీలక్ష్మీనారాయణ, నటుడు అలీ, మేజర్ ఒబెరాయ్, జేఏసీ చైర్మన్ అంజిబాబు, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… ‘‘మిత్రుడు లక్ష్మణ్ ఆపరేషన్ సింధూర్‌పై మన దేశ జవానుల గురించి పాట పాడటం, ఆ పాట లాంచ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషకరం. దేశంలోని జవాన్ల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని ఒక పాట రూపంలో మనకు చూపించారు. దానికి వారిని అభినందిస్తున్నాను. ఆయన ఎంత కాలం కేవలం ఆరోగ్యం గురించి డైట్ చెప్తారు అనుకున్నాను కానీ ఆయన తండ్రి కమ్యూనిస్టు పార్టీలో ఉండటంవల్ల ఆయన భావజాలాలు, దేశం కోసం ఏమైనా చేయాలి అనే తపన లక్ష్మణ్‌లో ఈ పాట ద్వారా కనిపించాయి. మనం ముఖ్యంగా రైతులకు, జవాన్లకు ప్రాముఖ్యత ఇస్తూ జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో వారిని గౌరవిస్తాము. గడియారంలో మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసే సమయానికి ముల్లులు నమస్కరిస్తూ రైతులకు గౌరవం ఇస్తాయి. అదేవిధంగా రాత్రి 12 గంటలకు మన ప్రశాంతంగా పడుకోవడానికి గల కారణంమైన జవాన్లకు మరోసారి అదే గడియారంలోని ముల్లులు నమస్కరిస్తూ వారికి గౌరవం ఇస్థాయి. కొన్ని దేశాలలో కచ్చితంగా వారి జీవితంలోని రెండు సంవత్సరాలు మిలటరీలో ఉంటారు. అదే రూల్ మనదేశంలో కూడా ఉండాలని సూచిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం’’ అన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ… ‘‘మంచి కంటే చెడు వేగంగా ప్రజల్లోకి వెళుతుంది. అలాంటిది లక్ష్మణ్ గారు అందరికీ ఉపయోగపడేలా ఆరోగ్యాన్ని పంచుతున్నారు. నాకు తెలిసి లక్ష్మణ్ గారు కూడా ఒకప్పుడు చాలా బరువు ఉండేవారు. కానీ ఆయన ఆ కష్టాన్ని అధిగమించి నేడు అదే మార్గంలో ఎంతో ఆరోగ్యంగా అందరికి ఉపయోగపడేలా డైట్ అందిస్తూ ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. దేశంపై భక్తితో ఆయన చేసిన పాటను లాంచ్ చేయడం కోసం రావడం జరిగింది. ఈరోజు స్టేజిపై ఉన్న రియల్ హీరోలను కలవడం మరింత సంతోషాన్ని కలగజేస్తుంది. గడియారంలో కూడా రెండు చేతులు జోడించి నమస్కరించే ఒక గొప్ప విషయాన్ని నేడు మనకు తెలియజేసిన జెడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మణ్ గారిలో ఒక మంచి గాయకుడున్నాడు, నటుడు ఉన్నాడు. ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒబెరాయ్ గారు తెలుగులో మాట్లాడుతుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ… ‘‘దేశం కోసం చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి అని నాకు ఉండేది. నేడు నా వయసు 56 సంవత్సరాలు. అయినా ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి గల కారణం డైట్. మన ఆరోగ్య విధాలను మంచిగా ఉండేలా చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆరోగ్యంగానే ఉంటాము. అయితే ఆరోగ్య డైట్ కంటే ముందే నాలో ఒక విప్లవ కళాకారుడు, ఒక గాయకుడు, ఒక రచయిత ఉన్నాడు. మిలటరీ మాధవపురం అనే ఊరుకు ప్రతి సంవత్సరం వెళ్లి పాటలు పడేవాళ్ళం. వాళ్లే మాకు ఇన్స్పిరేషన్. దేశం కోసం ఏమైనా చేయాలి అని అందరికీ ఒక స్ఫూర్తినివ్వలని అనే ఉద్దేశంతో ఈ పాటను చేశాను. ఈ పాటను మురళి నాయక్ కుటుంబానికి అంకితం చేస్తున్నాను. సరిహద్దులో జవాన్లు మన దేశం కోసం కాపలా కాస్తున్నట్లు దేశంలోపల నుండి నేను అందరి ఆరోగ్యం కోసం డైట్ చేపిస్తూ కాపలా కాస్తున్నాను. ఆహారం మాది, ఆరోగ్యం మీది, ఆరోగ్య డైట్’’ అని చెప్పారు.
ప్రజావాణి చీదిరాల