‘సత్యం’ సినిమా చేయవద్దన్నారు.. నా మనసు మాట విన్నా..

కొందరు ముద్దుగుమ్మలను ఎప్పుడు చూసినా అదే ఫీల్ కలుగుతుంది. అలాగే జెనీలియాను చూస్తే హ.. హ.. హాసిని మదిలో మెదులుతుంది. తెలుగులో జెనీలియా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను చేసింది. 2012 తర్వాత ఇంత కాలానికి తెలుగు తెరపై జెనీలియా తిరిగి కనిపించబోతోంది. కిరీటి, శ్రీలీల జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రం ద్వారానే జెనీలియా ప్రేక్షకులను మరోసారి కనువిందు చేయనుంది. ఈ చిత్రం జూలై 18న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జెనీలియా ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘‘దక్షిణాది చిత్రంలో దాదపు 13 ఏళ్ల తర్వాత నటించబోతున్నా. మూడేళ్ల కిందట ఈ సినిమా కథ విన్నాను కానీ అప్పటికి నటించాలా.. వద్దా? అన్న నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఆ సమయంలో నా పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు. అయితే దర్శకుడు కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నా. ‘జూనియర్’లో నా పాత్ర చాలా కొత్తగా ఉండటంతో పాటు గంభీరంగా కనిపిస్తా. వరుసగా సినిమాలు చేయాలనైతే లేదు కానీ మంచి పాత్రలు వస్తే మాత్రం తప్పకుండా చేస్తా. తెరపై మన పాత్ర ఎంతసేపు కనిపిస్తామన్నది ముఖ్యం కాదు.. మన పాత్ర ప్రభావం ఎంతుంటదనేదే ముఖ్యం. ‘జూనియర్’ సినిమా తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో కూడిన మంచి ఎంటర్‌టైనర్.

రామ్ చరణ్‌ను ‘ఆర్ఆర్ఆర్’లో చూస్తుంటే ‘ఆరెంజ్‌’లో చేసింది ఇతనితోనేనా అనిపించింది. ఇక ఎన్టీఆర్ మూడు పేజీల స్క్రిప్ట్ అయినా ఇలా చదివేసి అలా రెడీ అయిపోతాడు. అల్లు అర్జున్ చాలా గొప్ప నటుడు. సాధారణంగా హీరోయిన్స్‌కు పెద్దగా అభిమానులైతే ఉండరు కానీ ‘హాసిని’ పాత్రతో మాత్రం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నా. కెరీర్‌లో బిజీగా ఉండగానే జీవితం కూడా ముఖ్యమని పెళ్లి చేసుకున్నా. ‘నువ్వే కావాలి’ చిత్రం తెలుగులోనూ మంచి సక్సెస్ సాధించింది. ఆ తరువాత ఈ సినిమాకు రీమేక్.. హిందీలో ‘తుజే మేరీ కసమ్’ చేశా. గతంలో ‘సత్యం’ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ సినిమా చేయవద్దని నాకు ఎందరో సలహా ఇచ్చారు కానీ ఆ సినిమా నేను చేశాను. చాలా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా విషయంలో నా మనసు చెప్పిన మాట విన్నాను’’ అని జెనీలియా చెప్పుకొచ్చింది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *