త్వరగా తగ్గిపోవాలని తెగ డైట్స్ చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది ఫాలో అవుతున్నది మాత్రం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇదొక్కటే కాదు.. చాలా రకాల ఉపవాసాలు ఉన్నాయి. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కాకుండా వెయిట్ లాస్ కోసం ఈ డైట్స్‌ను వాడుతుంటారు. అవేంటో తెలుసుకుందాం.
ఈట్ స్టాప్ ఈట్..
కొత్తొక వింత పాతొక రోత మాదిరిగా ఎన్నో ఫాస్టింగ్స్ వస్తున్నాయి. కొంతకాలం తర్వాత అవి పోయి కొత్తగా మరొకటి పుట్టుకొస్తోంది. అలా కొన్నేళ్లపాటు ఈ ఫాస్టింగ్ బాగా ప్రాచుర్యంలో ఉంది. ఫిట్‌నెస్ నిపుణుడు బ్రాడ్ పిలాన్ ప్రవేశపెట్టిన ఈ ఫాస్టింగ్ కోసం వారంలో 48గంటల పాటు ఉపవాసం ఉండాలి. అంటే ఓ రోజు రాత్రి డిన్నర్ చేశాక మూడో రోజు రాత్రి డిన్నర్ చేసేంత వరకూ ఉపవాసం ఉండాలన్న మాట. డిన్నర్ నుంచే కాదండోయ్ బ్రేక్ ఫాస్ట్ నుంచైనా తీసుకోవచ్చు. ఎప్పటినుంచి అయితే ఏమి 48 గంటల పాటు ఉపవాసం ఉండాలి. దీనిలో ఒక వెసులుబాటు ఉంది. ఉపవాసం సమయంలో నీళ్లు, కాఫీ, జీరో కేలరీలు ఉండే ఇతర పానీయాలు తీసుకోవచ్చు.
5:2 డైట్..
దీన్నే ఫాస్ట్ డైట్ అని అంటారు. ఇది కొంతకాలం పాటు ప్రాచుర్యంలో ఉంది. ఈ రకం ఉపవాసంలో.. వారానికి ఐదురోజులు సాధారణంగానే ఆహారం తీసుకుని రెండు రోజులు మాత్రం ఉపవాసం ఉంటారు. ఈ రెండు రోజుల్లో మహిళలు 250 కేలరీల చొప్పున, పురుషులు 300 కేలరీల చొప్పున రెండు సార్లు ఆహారం తీసుకోవాలి. మొత్తంగా రెండు రోజుల్లో మహిళలు 500 కేలరీలు, పురుషులు 600 కేలరీలకు మించకుండా ఆహారం తీసుకోవాలన్నమాట.
ది వారియర్ డైట్
ఈ డైట్‌లో రోజూ తెల్లవారుజామున 4గంటల నుంచి మధ్యాహ్నం 12లోపు పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక యుద్ధంలా కాకుండా తక్కువ మొత్తంలో తీసుకోవాలి. తర్వాత సాయంత్రం 4 వరకూ గ్యాప్ ఇచ్చి 4 నుంచి 8 గంటల లోపు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి.
స్పాంటేనియస్ మీల్ స్కిప్పింగ్
పేరులోనే ఉంది కదా.. మీల్‌ను స్కిప్ చేయాలి. వారంలో రెండు రోజులు బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్ తీసుకోకూడదు. ఎప్పుడైనా మీకు ఆకలిగా లేదనుకోండి. ఆ సమయంలో తీసుకోవాల్సిన బ్రేక్‌ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మానేసి లో కేలరీ ఫుడ్ తీసుకోవాలి.
ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్
ఇందులో వారంలో మూడు రోజుల పాటు అంటే రోజు మార్చి రోజు ఉపవాసం ఉండాలి. ఒకవేళ తీసుకున్నా కూడా కేవలం 500 కేలరీల ఆహారం తీసుకోవాలి.
168 మెథడ్..
ఈ 168 మెథడ్‌ను లీన్‌గెయిన్స్ ప్రొటోకాల్ పద్ధతి అని కూడా అంటారు. ఈ ఫాస్టింగ్‌లో బ్రేక్ ఫాస్ట్ ఉండదు. మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 8 గంటల లోపల రెండు, లేదా మూడు అంతకంటే ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవచ్చు. రాత్రి 8 తర్వాత ఫుడ్ ఏమీ తీసుకోకూడదు. దీనిని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని కూడా అలంటారు. ఫాస్టింగ్ సమయంలో నీళ్లు, కాఫీ, ఇతర జీరో కేలరీల పానీయాలు తీసుకోవచ్చు.