యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్.. ఇవి ఇండస్ట్రీ ఇచ్చిన పేర్లు.. బుడ్డోడు.. ఫ్యాన్స్ ప్రేమగా పెట్టుకున్న పేరు.. ఏదైతేనేమి అందరికీ నచ్చినవాడు.. ప్రపంచం మెచ్చిన వాడు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ట్యాగ్ తెలుగు అందిస్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా (1991)తో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు ఎన్టీఆర్. తాత సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. పేరు, రూపం, డైలాగ్ డెలివరీ, నటన అన్నీ తాత నందమూరి తారకరామారావు నుంచి పుణికిపుచ్చుకున్నాడు. అందుకే పెద్దగా సమయం తీసుకోకుండా జనానికి.. జపాన్‌కి చేరువయ్యాడు. విజయం అంతు చూడాలనుకున్నాడో ఏమో కానీ.. ‘నిన్నుచూడాలని’ అంటూ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ‘స్టూడెంట్ నంబర్ 1’.. ఆపై ‘ఆది’తో బ్లాక్ బస్టర్ హిట్. ‘సింహాద్రి’తో మనోడి రేంజ్ మారిపోయింది.
ఇక ఆ తరువాత అందరు హీరోలకు వచ్చినట్టే మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా జనాలు వాటిని పట్టించుకోలేదు. అలా చూస్తుండగానే 30 సినిమాలు చేసేశాడు. ‘అదుర్స్’తో నవ్వించాడు.. ‘జనతా గ్యారేజ్’తో మెసేజ్ ఇచ్చాడు. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ప్రేమను కురిపించాడు. ఇలా ఒక్కొక్క సినిమాతో తనలోని ఒక్కొక్క యాంగిల్‌ను పరిచయం చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ ప్రపంచానికి దగ్గరయ్యాడు. జపాన్ వాసులకైతే మరింత దగ్గరయ్యాడు. తెలుగు నేర్చుకుని వచ్చి మరీ ఎన్టీఆర్‌తో మాట్లాడటం ఆ మధ్య ఓ వీడియోలో చూశాం. ఇంతటి ఘనత ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. ప్రస్తుతం ‘వార్ 2’తో బాలీవుడ్ ఎంట్రీ సైతం ఇస్తున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో కలిసి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ఎన్టీఆర్ సాధించిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. ‘ఈస్టర్న్ ఐ 2023’లో స్థానం సంపాదించాడు. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ జాబితాలోనూ రెండు సార్లు నిలిచాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆయన లక్కీ నంబర్ 9. ఆయన కారు నంబర్ నుంచి ట్విటర్ అకౌంట్ వరకూ అన్నీ 9తోనే ఉంటాయి. ఎన్టీఆర్ నటుడే కాదు.. మంచి సింగర్ కూడా.. ఆయన పాడిన రెండు పాటలు అద్భుతమైన సక్సెస్ సాధించాయి. ఇక బుల్లితెరపై కూడా తనదైన మార్క్ వేశాడు. రెండు షోలకు హోస్టింగ్ చేశాడు. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఆయన హోస్టింగ్‌ను ఎవరూ మర్చిపోలేరు. సీజన్స్ ఎన్ని మారినా బిగ్‌బాస్ సీజన్ 1 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన హోస్టింగ్ అలాంటిది మరి. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అంటూ కూడా అద్భుతంగా హోస్టింగ్ చేశాడు. ఆయన ఓకే అనాలే కానీ కోట్లు కుమ్మరించే షో నిర్వాహకులు ఉన్నారు. కానీ ఎందుకో ఒకే సీజన్ చేసి.. తనదైన ఫుట్ స్టెప్‌ను వదిలేసి వెళ్లిపోతుంటాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. వెండితెర అయినా.. బుల్లితెర అయినా.. ఆయనే ‘బాద్‌షా’.
ప్రజావాణి చీదిరాల