విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. రూ.300 క్యూలైన్‌లో గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు అర్థరాత్రి నుంచే క్యూలైన్‌లలో వేచి ఉన్నారు. అయితే సింహాచలంలో అర్థరాత్రి దాటిన అనంతరం భారీగా వర్షం కురిసింది. దీంతో రూ.300 క్యూలైన్‌లో గోడ భక్తులపై ఒక్కసారిగా కూలడంతో పెను ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనా స్థలికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇతర అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఏడుగురి మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించగా.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సింహాద్రి అప్పన్నగా పేరుగాంచిన వరహా లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. ఆలయ అర్చకులు వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరుచేశారు. చందనాన్ని పూర్తిగా తొలగించిన మీదట నిజరూపంలోకి వచ్చిన స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం తొలుత ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు కుటుంబం స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించింది. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రొటోకాల్, అంతరాలయ దర్శనాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.