...

Shashtipurthi Movie Review: ‘షష్టిపూర్తి’ ఎలా ఉందంటే..

చిత్రం: షష్టిపూర్తి
విడుదల: 30-05-2025
నటీనటులు: రూపేష్, ఆకాంక్ష, రాజేంద్రప్రసాద్, అర్చన తదితరులు
కథ, దర్శకత్వం: పవన్ ప్రభ
బ్యానర్: మా ఆయి ప్రొడక్షన్స్
నిర్మాత: రూపేష్
మ్యూజిక్: ఇళయరాజా
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: రామ్

ఏ సినిమాకి అయినా టైటిల్ ప్రధానం. ఫస్ట్ టైటిల్ ఎంత బాగుంటే అంత జనాల్లోకి వెళుతుంది. ఈ సినిమాకు కూడా ‘షష్టిపూర్తి’ అనే అద్భుతమైన టైటిల్ పెట్టారు. చాలా కాలం తర్వాత తెలుగుదనం ఉట్టిపడే పేరు చెవిన పడటంతో సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందోనని అంతా అనుకున్నారు. ప్రమోషన్స్ పీక్స్‌లో ఉండటంతో సినిమా కూడా జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. రాజేంద్ర ప్రసాద్, అర్చన, ఇళయరాజా, తోట తరణి వంటి హేమాహేమీలు సినిమాకు పని చేయడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుందో చూద్దాం.

సినిమా కథేంటంటే..

సినిమాను చక్కగా రాజమండ్రి గోదావరి నదిని చూపిస్తూ ప్రారంభించాడు దర్శకుడు. శ్రీరామ్ (రూపేష్) వచ్చి గోదావరిలో దూకడం.. అక్కడ చేపలు పట్టే వారంతా ఎవరో ఆత్మహత్య చేసుకున్నారని భావించి అతడిని ఒడ్డుకు తీసుకొస్తారు. అక్కడి నుంచి సినిమా కథ ప్రారంభమవుతుంది. తన తల్లిదండ్రులు తన కారణంగానే విడిపోయారని.. కాబట్టి వారిని తనే కలపాలనే సంకల్పంతో ఉన్నట్టు చెబుతూ తన కథను చెప్పడం ప్రారంభిస్తాడు. శ్రీరామ్ ఒక న్యాయవాది. తల్లి చిన్నప్పటి నుంచి నీతి నిజాయితీగా ఉండాలంటూ పెంచడంతో అతను కూడా ఎప్పుడూ నిజమే మాట్లాడుతుంటాడు. సమాజం నిజాయితీగా ఉండాలంటుంది.. కానీ నిజం చెప్పేవారిని దగ్గరకు రానివ్వదు. శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే. నిజాలు చెబుతున్నాడని.. అతడిని అంతా దూరం పెడుతుంటారు. అలాంటి శ్రీరామ్ జీవితంలోకి జానకి (ఆకాంక్ష) వస్తుంది. ఆ తరువాత అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అసలు జానకి అతని జీవితంలోకి ఎందుకొచ్చింది? దివాకరం (రాజేంద్రప్రసాద్), భువనేశ్వరి (అర్చన)లు ఎందుకు విడిపోవాలనుకుంటారు? వంటి అంశాలతో ఈ సినిమా రూపొందింది.

సినిమా ఎలా ఉందంటే..

సినిమాను టైటిల్‌కు అనుగుణంగా తీసి ఉన్నా అందరి మన్ననలూ అందుకునేదేమో. కానీ ప్రమోషన్స్‌లో రాజేంద్రప్రసాద్, అర్చనలను హైలైట్ చేసిన మేకర్స్.. సినిమాలో మాత్రం వారికి పెద్దగా స్థానమివ్వలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం శ్రీరామ్ క్యారెక్టర్‌ను రివీల్ చేయడం, ఆ తరువాత జానకితో ప్రేమకు పరిమితం చేశారు. ఈ ఫస్ట్ హాఫ్‌లో రాజేంద్రప్రసాద్, అర్చనలు.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. సెకండ్ హాఫ్‌లో అది కూడా కాస్త స్టోరీ నడిచాక కానీ వీరిద్దరి పూర్తి స్థాయి ఎంట్రీ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమాత్రం ఆకట్టుకోదు. ఎక్కడా కూడా లాజిక్‌కి అందకుండా కథ నడుస్తూ ఉంటుంది. ప్రతి సన్నివేశం మన మెదడులోఏదో ఒక ప్రశ్నను తలెత్తేలా చేస్తుంది. రెండు విభిన్న తరాలకు చెందిన ప్రేమ, బంధాలను ఆవిష్కరించేటప్పుడు ఎంత అద్భుతంగా ఆవిష్కరించవచ్చు? కానీ అసలు ఏమాత్రం మెప్పించేలా దర్శకుడు కథను చెప్పలేకపోయారు. కనీసం టైటిల్‌కు జస్టిఫికేషన్ ఎక్కడా కనిపించదు. మొత్తంగా సినిమా కథ, కథనం అయితే ఏమాత్రం మెప్పించవు.

నటీనటుల పనితీరు..

రాజేంద్రప్రసాద్, అర్చనలు ఎప్పటి మాదిరిగానే తమ నటనతో మెప్పించారు. రూపేష్ కొత్త నటుడు అయినా కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. హీరోయిన్ ఆకాంక్ష కూడా పర్వాలేదనిపించింది. ఇక మిగిలినవన్నీ అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే.

టెక్నికల్ పరంగా సినిమా ఎలా ఉందంటే..

ఇళయరాజా సంగీతం ఎప్పటిలాగే అలరించింది. రామ్ సినిమాటోగ్రఫీ చాలా పేలవంగా ఉందనే చెప్పాలి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగానే ఉంది. కాస్ట్యూమ్స్ మాత్రం బాగున్నాయి. ఇంతకు మించి సినిమాలో టెక్నికల్ పరంగా చెప్పుకోవల్సిన అంశాలు కూడా ఏమీ లేవనే చెప్పాలి.

బలహీనతలు

సాగదీత, కథలో బలం లేకపోవడం, స్క్రీన్‌ప్లే మెప్పించలేకపోవడం, రాజేంద్రప్రసాద్, అర్చనలను సెకండ్ హాఫ్‌కే పరిమితం చేయడం

ప్లస్ పాయింట్స్..

రాజేంద్ర ప్రసాద్, అర్చన నటన

ఫైనల్ వర్డిక్ట్: ఇలాంటి ‘షష్టిపూర్తి’ చూడటం కాస్త కష్టమే..

రేటింగ్: 2/5

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.