AP Politics :
అవినాశ్ రెడ్డిని ఢీకొట్టనున్న పీసీసీ చీఫ్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంటోంది. ఇప్పటికే మూడు పార్టీల ఎన్డీఏ కూటమి, మరోవైపు అధికార వైసిపి తమ అభ్యర్థుల జాబితాలను పూర్తిగా విడుదల చేయగా.. వామపక్షాలతో కలిసి కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానంపైనా క్లారిటీ ఇచ్చింది. షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించింది.
కడపలో ప్రస్తుతం సిటింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసారి వైసీపీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డి కి వ్యతిరేకంగా పోరాడుతున్న వివేకా కుమార్తె సునీతారెడ్డికి షర్మిల అండగా నిలుస్తున్నారు. మరోవైపు సొంత సోదరుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పైనా షర్మిల విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కడపలో షర్మిల పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి టీడీపీ ఇప్పటికే భూపేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది.
ఇక ఢిల్లీలో సోమవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టింది.
117 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
కాంగ్రెస్ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాలో రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జెడి శీలం, కాకినాడ నుంచి పల్లంరాజు ఉన్నారు. వీరితోపాటు అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, విశాఖ నుంచి సత్యారెడ్డి, ఏలూరు నుంచి లావణ్య, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, హిందూపురం నుంచి షాహిన్, చిత్తూరు బరిలో చిట్టిబాబు పేర్లు ఖరారు అయ్యాయి. కాగా పిసిసి మాజీ చీఫ్ రఘువీరారెడ్డి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఆయన ప్రచారానికి పరిమితం కానున్నారు.
మొత్తంగా 117 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సీఈసీ భేటీలో చర్చించారు. మరో ఎనిమిది ఎంపీ స్థానాలు, 58 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Also Read This Article : నారా లోకేశ్ కు జడ్ కేటగిరీ భద్రత