...

విజయభాను.. ఎక్కడైతే నటిగా ఎదిగారో.. అక్కడే మృత్యుఒడికి..

ప్రసిద్ధ నృత్య కళాకారిణి, ప్రముఖ నటి విజయభాను మృతి చెందారు. అనే పేరుతో ఒక నటీమణి ఉండేవారని నేటి తరానికి దాదాపుగా తెలియకపోయి ఉండొచ్చు. 70వ దశకంలో ఒక వెలుగు వెలిగారు. అప్పటి అగ్ర కథానాయకులందరి సినిమాల్లోనూ నటించారు. తెలుగు సినిమా రంగంలో విజయపతాకం ఎగురవేయడమే కాకుండా… తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించారు. ముఖ్యంగా అప్పట్లో “రాజబాబు – విజయభాను” జంటకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. కేవలం పదేళ్ల వ్యవధిలోనే వందకు పైగా సినిమాలు పలు భాషల్లో చేసిన విజయభాను అప్పట్లోనే పాన్ ఇండియా యాక్ట్రెస్‌గా గుర్తింపు పొందారు. అమెరికాలో స్థిరపడిన విజయభాను.. ఇటీవల ఇండియాకు వచ్చి… ఇక్కడే తనువు చాలించారు. ఆమె వయసు 68.. అనంతపురానికి చెందిన విజయభాను.. పుట్టింది, పెరిగింది, పేరు తెచ్చుకుంది అంతా చెన్నైలోనే..

కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఓ అమెరికన్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయి… కెరీర్ తో పాటు ఇండియానూ విడిచిపెట్టి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో విజయభాను స్థిరపడిపోయారు. స్వతహాగా నాట్యకారిణి కావడంతోపాటు…”నాట్యమయూరి” బిరుదాంకితురాలైన విజయభాను…లాస్ ఏంజెల్స్ లో “శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్” పేరుతో నృత్య కళాశాల స్థాపించి, వేలాది మందికి తర్ఫీదు ఇచ్చారు. మన భారతీయ నాట్యకళలైన “భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకేళి” వంటి అన్ని నృత్యరీతులలోనూ నిష్ణాతురాలైన విజయభాను ప్రపంచవ్యాప్తంగా లెక్కకుమిక్కిలిగా నాట్య ప్రదర్శనలు ఇచ్చి ఉండడం విశేషం. అమెరికా కోడలుగా మారి, అక్కడే స్థిరపడినప్పటికీ… భారతీయ మూలాలు ఎన్నడూ మరువని విజయభాను… అనంతపురంలో ఆమె మాతృమూర్తి కట్టించిన “శివ నారాయణ పంచముఖ ఆంజనేయ దేవాలయం” అభివృద్ధికి ఇతోధికంగా సాయం చేశారు.

గత నెలలో ఇండియా పర్యటనకు వచ్చి, చెన్నైలోని తన ఇంటిని చూసుకునేందుకు వెళ్లిన విజయభాను… ఎండ వేడి తట్టుకోలేక వడదెబ్బకు లోనై… అర్ధాంతరంగా అశువులు బాశారు. “తన ఇంట్లో చనిపోవడం కోసమే ఆమె పనిగట్టుకుని అమెరికా నుంచి ఇండియా వచ్చారా…?” అనిపించేలా.. ఎక్కడైతే ఆమె ఒక నటిగా విరాజిల్లారో… అక్కడే మృత్యువు ఒడి చేరారు. చిరంజీవి, కమల్ హాసన్, జయసుధలతో కె. బాలచందర్ తెరక్కించిన దృశ్యకావ్యం “ఇది కథ కాదు” చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మనసు దోచుకున్న విజయభాను… ఆ చిత్రంలో కనబరిచిన అత్యుత్తమ నటనకు “ఉత్తమ సహాయ నటి”గా నంది పురస్కారం అందుకున్నారు.

నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా “నాట్యమయూరి” బిరుదునూ అందుకున్నారు. “నిప్పులాంటి మనిషి (ఎన్ఠీఆర్), ఇది కథ కాదు (చిరంజీవి – కమల్ హాసన్), కిలాడి బుల్లోడు (శోభన్ బాబు), ఒక నారి వంద తుపాకులు (విజయ లలిత), చందన (హీరోగా రంగనాథ్ మొదటి చిత్రం), ప్రియబాంధవి (శారద), స్త్రీ (కృష్ణంరాజు), శభాష్ పాపన్న (జగ్గయ్య), చిన్నికృష్ణుడు” (జంధ్యాల – ఘట్టమనేని రమేష్ బాబు) తదితర చిత్రాలు విజయభాను పేరు ఆరోజుల్లో మారుమ్రోగేలా చేశాయి. విజయభాను ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ కథానాయకి – మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద, ప్రముఖ నటులు సుమన్, ప్రముఖ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.