గద్దర్ అవార్డులపై భిన్నాభిప్రాయాలు!
Revanth Reddy Latest News: నంది అవార్డుల పేరు మార్చుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన తొందరపాటా?
సినీ కళాకారులను, సాంకేతిక నిపుణులను ప్రభుత్వ పరంగా ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నంది అవార్డులకు విప్లవకారుడిగా పేరున్న
గద్దర్ పేరు పెట్టడం సరియైనదేనా సినీ పరిశ్రమ వర్గాలు, సిని ప్రియుల్లో ? ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.
రాష్ట్ర విభజన తరువాత నిలిచిపోయిన సినీ అవార్డులను తిరిగి ఇవ్వాలన్న ఆలోచనను అందరూ ముక్తకంఠంతో అభినందిస్తున్నా..
నంది స్థానంలో గద్దర్ పేరు పెట్టడంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గద్దర్ గొప్ప కవి, గాయకుడు అనడంలో
ఎటువంటి సందేహం లేదు. నక్సలైట్ విప్లవోద్యమంలో, ప్రజా బాహుళ్యంలో ఆయన రాసిన, పాడిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా
నిలిచిపోయేవే. తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ పాత్రను ఎవరూ తక్కవగా చూడలేరు. సినిమాల్లోనూ పలు చిత్రాలకు ఆయన పాటలు
రాయడంతోపాటు వాటిని ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ‘బండెనక బండి కట్టీ..’ అంటూ మా భూమి సినిమాలో గద్దర్ ఏనాడో
పాటను పాడటంతోపాటు స్వయంగా ఆ పాటలో నటించారు కూడా. జై బోలో తెలంగాణ చిత్రంలో ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న
కాలమా.. ’ అంటూ తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చినా, ఒరేయ్ రిక్షా చిత్రంలో ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ అంటూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని కళ్లకుగట్టినా అది గద్దర్ కే చెల్లింది. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తి పేరిట అవార్డు
ఇవ్వడం గద్దర్ ను గౌరవించుకోవడమే అవుతుంది. అయితే.. కొందరు అభ్యంతరం తెలుపుతున్నది మాత్రం మొత్తం అవార్డులకు
ఆయన పేరు పెట్టడాన్నే.
రజత నంది స్థానంలో రజత గద్దర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో కొన్నాళ్లపాటు నంది అవార్డులను రాష్ట్రంలోని కళలకు ఆలవాలంగా
నిలిచిన ఓ ప్రసిద్ధ క్షేత్రానికి చిహ్నంగా అందజేస్తూ వచ్చారు. కళాకారులు, సాంకేతిక నిపుణులు, ఉత్తమ చిత్రాలకు వరుసగా
బంగారు నంది, రజత నంది, కాంస్య నంది పురస్కారాలను అందజేశారు. కానీ, రాష్ట్రం విడిపోయినందున తెలంగాణలో నందిని
మార్చి మరో చిహ్నంతో అందజేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అయితే ఇందుకు రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రాన్నిగానీ, చిహ్నాన్నిగానీ
ఎంచుకోవాల్సిందన్నది పలువురి అభిప్రాయం. అదే సమయంలో ప్రజా యుద్ధనౌకగా పేరుగాంచిన గద్దర్ ను గౌరవించుకోవాలని
భావించినప్పుడు ఆయన పేరిట ప్రాధాన్యం కలిగిన కేటగిరీతో అవార్డును ప్రవేశపెట్టాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతే తప్ప.. బంగారు నంది స్థానంలో బంగారు గద్దర్, రజత నంది స్థానంలో రజత గద్దర్ ప్రతిమను ఇవ్వడం ఆయన గౌరవానికి
కూడా భంగం కలిగించడమే అవుతుందని అంటున్నారు. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం పున:పరిశీలన చేయాలని, ఈ అంశంలో
మార్పులు చేయాలని సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖుల నుంచి సలహాలు తీసుకోకుండా ప్రకటించి ఉంటే దీనిని
సరిదిద్దాలని కోరుకుంటున్నారు. సినీ ప్రముఖుల్లో కూడా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్ మినహా రేవంత్ నిర్ణయాన్ని
ఇప్పటివరకూ ఒక్కరు కూడా స్వాగతించలేదు. దీనిని బట్టి అయినా ముఖ్యమంత్రి గుర్తించాలని అంటున్నారు.
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?