ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రెట్రో’

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా విడుదల విషయమై గత కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా తేదీని ప్రకటించింది. ఈ సినిమాలో జయరామ్, నాజర్, ప్రకాశ్‌ రాజ్ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా థియేటర్లలో అయితే ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. మరి ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి.

‘రెట్రో’ కథేంటంటే.. పారి అలియాస్‌ పార్వేల్‌ కన్నన్‌ (సూర్య) పసివాడుగా ఉండగానే పుట్టిన ఊరికి.. తల్లిదండ్రులకు దూరమవుతాడు. గ్యాంగ్‌స్టర్ తిలక్ (జోజు జార్జ్‌) భార్యకు పారి దొరుకుతాడు. తిలక్‌కు ఇష్టం లేకున్నా భార్య కోరిక మేరకు పారిని దత్తత తీసుకుంటాడు. దత్తత అయితే తీసుకుంటాడు కానీ పారి అంటే తిలక్‌కు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఒకసారి తిలక్‌పై శత్రువులు అటాక్ చేయగా పారి రక్షిస్తాడు. అప్పటి నుంచి పారిని తిలక్ దగ్గరకు తీస్తాడు. పారి కూడా ఒక గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. ఆ తరువాత రుక్మిణి (పూజా హెగ్డే)ని ప్రేమిస్తాడు. ఆమె కోరిక మేరకు పెళ్లి చేసుకున్నాక హింసాత్మక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లికి సర్వం సిద్ధమవుతుంది. మరి ఆ పెళ్లి జరిగిందా? రుక్మిణితో కలిసి ప్రశాంతంగా జీవించాలనుకున్న పారి తాను అనుకున్నది సాధించాడా? అసలు పారి ఎవరు? వంటి ఆసక్తికర విషయాలతో సినిమా రూపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *