దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు సంపాదించిందో.. అంతే గుర్తింపును హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా సంపాదించుకున్నారు. ఈసారి మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్ వేదికగా జరిగింది. దీనిలో పాల్గొనేందుకు వచ్చిన బ్యూటీల్లో మిస్ జపాన్ కియానా తుమీత కూడా ఒకరు. ఆమె భారత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడింది. కేంబ్రిడ్జ్.. ఎడింబరో వర్సిటీల్లో విమెన్ లీడర్ షిప్ మాస్టర్ డిగ్రీ తుమీత.. ఒక బిజినెస్ ఛానల్‌లో యాంకర్‌గా కూడా పని చేస్తోంది.
అంతేకాదు.. ఆమె ఒక జపనీస్ కాలిగ్రాఫర్, ఎలక్ట్రిక్ ఫ్లూట్ కూడా వాయిస్తుంది. జపాన్‌లో స్త్రీ, పురుష వివక్ష ఎక్కువని.. ఒక్క విద్య విషయంలో తప్ప అన్ని విషయాల్లోననూ పురుషులదే ఆధిపత్యమని వెల్లడించింది. టెక్నికల్‌గా భారత్ చాలా ముందుందని.. ఏ సాంకేతికతనైనా భారతీయులు ఇట్టే అర్థం చేసుకోగలరని తెలిపింది. భారత్‌లో నేరవార్తల గురించి విని కొంత ఆందోళన చెందానని.. ఇక్కడికి వచ్చాక తనలోని భయాలు పోయాయిన తెలిపింది. జపాన్‌లో ‘నాటు నాటు’ పాట బాగా ఫేమస్ అని.. తనకు కూడా ఆ పాటంటే ఎంతో ఇష్టమని కియానా తుమీత తెలిపింది. తనకు అవకాశం వస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో నటించేందుకు సిద్ధమని వెల్లడించింది. మిస్ జపాన్ అయితే కుండబద్దలు కొట్టేసింది. మరి మన దర్శకులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటారో లేదో చూడాలి.