AP Politics :
కర్మణ్యే వాధికారస్తే మా పలేషు కథాచన…అంటే నువ్వు కర్మ (పని) చేయటానికి మాత్రమే కాని, ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలను చేయకుండా మానకు. ఈ సూత్రానికి కట్టుబడి పనిచేసే ప్రతి ఒక్కరూ సమాజ హితం కోరి పనిచేస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. వారి పని వారు చేసుకుంటూ సమాజానికి అండగా ఉండాలనే కృత నిశ్చయంతో మెడలో ఆకుపచ్చ కండువా ధరించి మీకు నేనున్నానంటూ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన వీర మహిళ కథకూడా పైన చెప్పిన భగవధ్గీతలోని శ్లోకం కథ లాంటిదే. అలా తన చుట్టూ ఉన్న రైతులు గోడు వినలేక కన్నీరు కార్చిన మహిళ కథే ఈ స్టోరీ. చదువుతూ ఊ కొట్టండి.
అనగనగా అమరావతి నగరం. అప్పుడప్పుడే తమ ఆశలు పురుడు పోసుకుంటున్న వేళ. రైతులందరూ తమ భూములకు రెక్కలొచ్చాయంటూ ఆకాశంలో ఆనందంగా విహరిస్తున్న వేళ అది. తమ పిల్లల భవిష్యతుకు ఇక తిరుగుండదు అని ప్రతి ఒక్కరూ కలలు కంటూ హాయిగా ఊసులు చెప్పుకుంటూ తమ పొలం గట్లకెళ్లి ఆశగా చూస్తూ లక్షల్లో ఉన్న భూముల రేట్లు కోట్లల్లోకి మారటంతో తమ జీవితాలకు సరిపడా సంతోషాన్ని అనుభవించిన వేళది. అటువంటి సమయంలో ఎలక్షన్స్ వచ్చి ఒక్కసారిగా తమ కలలన్నీ కల్లలైన వేళలో ఏంచేయాలో దిక్కుతోచని అమరావతి రైతులు ప్రభుత్వ పాలకుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న తన చుట్టు పక్కలవారందరికి పోరాటపటిమ ఉంది కానీ సరైన నాయకులు లేరు అని గుర్తించిన మహిళ నాయకురాలే ఈ కథలో రాజకుమారి. ఆమె ఆలోచనల్లో ఒక్కసారిగా… నేను ఈ సమాజం కోసం ఏదైనా చేయాలి. రాజధాని రైతులకు అండగా నిలవాలని అనుకున్నరోజు…ఏమి ఆలోచించలేదు. ఏదేమైనా, ఎవరడ్డొచ్చినా పోరాడే ఓపిక ఉన్నంతవరకు పోరాటం కొనసాగించాలి అని ఆకు పచ్చ కండువా మెళ్లో వేసుకుంది. ఆ కండువా మెడలో వేసుకున్న రోజు ఆమెకు అస్సలు తెలియదు. భవిష్యత్తులో ఈ కండువా అద్భుతాలు చేస్తుందని.
కథలో రాజకుమారిని ఈ పచ్చకండవానే నాయకురాలిగా నిలబెడుతుందని. అమరావతి రైతుల కష్టాలను విన్న ఆమె తన కన్నీళ్లను ఆయుధంగా చేసుకుని పోరాటాన్ని ఉధృతం చేసింది. రాజకీయంగా ఎటువంటి ఫలితం ఆశించలేదు. ఉద్యమంలో ఉన్నప్పుడు అనేక ఆటంకాలు వస్తాయని, ఆ ఆటంకాలను ఎదుర్కోవటానికి తనను తాను సిద్ధం చేసుకున్న ఆ మహిళే డాక్టర్ రాయపాటి శైలజ. అమరావతి రైతులను ఎవరిని కదిలించిన ఆమె కథ ఎంతో ఆనందంగా ఆమె మా శైలజ అని చెప్తారు. పై శ్లోకంలో చెప్పినట్లు ఆమె అనుకున్నట్లుగా తన పని తాను చేసుకుపోయింది. ఇప్పుడు తగిన ప్రతిఫలాన్ని అందుకుంది. తాను పోరాటం చేస్తూ అప్పటి ప్రభుత్వంలోని రాష్ట్ర మహిళ చైర్‌పర్సన్ అపాయింట్‌మెంట్ కోసం వెళితే అపాయింట్‌మెంట్ కూడా శైలజకు ఇవ్వలేదు. అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూసిన చోటే ఆమెను అందలం ఎక్కించి తనది మాస్టర్‌మైండ్ అని మరోసారి రుజువు చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డాక్టర్ రాయపాటి శైలజ పోరాటం గురించి విన్న, చూసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు చూపు ఆమె కష్టాన్ని కనిపెట్టింది. ఆమె కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించటానికి ఎదురుచూసిన ఆ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ కమీషన్ చైర్‌పర్సన్‌గా ఎవరూ ఊహించని పదవిని ఆమెకు కట్టబెట్టి భాద్యతాయుతమైన పదవిలో కూర్చోపెట్టారు. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేస్తే కార్యకర్తలను గుర్తించటంలో చంద్రబాబు అందెవేసిన చేయి అనే సంగతి అందరికి తెలిసిందే. ఆమె మహిళ చైర్‌పర్సన్ పదవికి తగిన న్యాయం చేస్తారని నమ్ముతూ పలువురు ఆమెను కొనియాడుతున్నారు. అల్ ది వెరీ బెస్ట్ ఉమెన్ ఛైర్‌పర్సన్ శైలజ అంటూ సోషల్ మీడియా వేదికగా అనేక పోస్ట్‌లు పెడుతున్నారు. ట్యాగ్‌తెలుగు.కామ్ ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తుంది.
శివమల్లాల
Also Read This : టాంపా నాట్స్ సంబరాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…