‘మాస్ జాతర’లో నేను పోషించిన ఆర్‌పిఎఫ్ అధికారి పాత్ర చాలా ప్రత్యేకమైనది: మాస్ మహారాజా రవితేజ
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జతర’. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాస్యం, భావోద్వేగాలు మరియు మాస్ అంశాలతో నిండిన వినోదభరితమైన కుటుంబ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘మాస్ జతర’ సినిమా, భారీ అంచనాల నడుమ అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు విశేష స్పందన లభించింది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా సుమతో కలిసి ఒక ఉల్లాసమైన మరియు వినోదాత్మక సంభాషణలో చిత్ర బృందం పాల్గొంది. ‘మాస్ జతర’ సినిమా ఎంత ప్రత్యేకమైనదో తెలిపేలా వీరి సంభాషణ సాగింది.
రవితేజ ఈ సినిమాలో తాను పోషించిన ఆర్‌పిఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) అధికారి పాత్ర గురించి మాట్లాడుతూ, ఇది తన సినీ ప్రయాణంలో సరికొత్త మరియు ప్రత్యేకమైన పాత్ర అని అభివర్ణించారు. అలాగే చిత్ర దర్శకుడు భాను భోగవరపు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోపై ప్రశంసలు కురిపించారు. భాను ప్రతిభావంతుడని, చిత్రీకరణ సమయంలో కూడా సన్నివేశాన్ని ఇంకా మెరుగ్గా మలచడానికి ప్రయత్నిస్తుంటాడని, చాలా వేగంగా మార్పులు చేయగలడని కొనియాడారు. భీమ్స్ ఎంతో కృషి చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడని అన్నారు. ఇక మాస్ జాతర సినిమా గురించి మాట్లాడుతూ.. వినోదం, మాస్ అంశాలతో పాటు హృదయపూర్వక కుటుంబ భావోద్వేగాలతో నిండి ఉంటుందని తెలిపారు.
రవితేజ గారితో కలిసి నటించడం చాలా ఆనందకరమైన అనుభవమని శ్రీలీల అన్నారు. రవితేజ గారితో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుందని, అత్యంత ఆహ్లాదకరమైన సహనటులలో ఆయన ఒకరని శ్రీలీల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మాస్ జతారలో తాను సైన్స్ టీచర్‌గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాసభరితమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని ఆమె వెల్లడించారు. తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది. స్క్రిప్ట్ చదివినప్పుడే తాను నవ్వుకున్నానని, ఇక సెట్ లో దానిని ప్రదర్శించే సమయంలో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయని శ్రీలీల పేర్కొన్నారు. రవితేజ అంకితభావం గురించి మాట్లాడుతూ.. గాయంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందు ‘తూ మేరా లవర్’ పాటను పూర్తి చేసి, తన నిబద్ధతను చాటుకున్నారని శ్రీలీల కొనియాడారు.
గతంలో సామజవరగమన మరియు వాల్తేరు వీరయ్య చిత్రాలకు రచయితగా పనిచేసిన దర్శకుడు భాను, హాస్యాన్ని రాయడం మరియు దానిని సహజంగా కథలో మిళితం చేయడంలో తన బలం ఉందని తెలిపారు. మొదటి రోజు షూటింగ్‌ను సులభంగా పూర్తి చేసి, ప్రారంభం నుండే తనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా సహాయపడినందుకు రవితేజకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టైటిల్ ఆలోచన రవితేజ గారి నుండే వచ్చిందని, దానికి “మనదే ఇదంతా” అనే ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌ను జోడించినట్లు భాను వెల్లడించారు. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ వినోదభరితమైన పాత్రలో కనిపిస్తారని కూడా ఆయన పేర్కొన్నారు. “ఓలే ఓలే” పాట చుట్టూ ఇటీవల జరిగిన చర్చలను ఉద్దేశించి దర్శకుడు భాను మాట్లాడుతూ.. సాహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, పాట యొక్క రెండవ భాగం పూర్తిగా భిన్నమైన మరియు పాజిటివ్ వైబ్‌ను కలిగి ఉందని స్పష్టం చేశారు.
మాస్ అంశాలు, హాస్యం మరియు హృదయాన్ని తాకే భావోద్వేగాల మేళవింపుతో ‘మాస్ జాతర’ చిత్రం అన్ని వయసుల ప్రేక్షకులను అలరించడానికి అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలవుతోంది.
చిత్రం: మాస్ జాతర
తారాగణం: రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: భాను భోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్,
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్