తల్లిదండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే నటులు కొందరే ఉంటారు. వారిలో రాజీవ్ కనకాల ఒకరు. తొలుత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రాజీవ్.. ఆ తరువాత వెండితెరపై కూడా ఎన్నో పాత్రల్లో జీవించారు. అప్పట్లో ఎన్టీఆర్ చిత్రమంటే రాజీవ్ స్నేహితుడిగానో.. లేదంటే విలన్ గానో కనిపించేవారు. అప్పటి నుంచి కూడా ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు.. ఎవర్ గ్రీన్ పాత్రలు ఎన్నో చేశారు. ప్రస్తుతం అయితే ఆయన చేస్తున్న సినిమాల లిస్ట్ చాలానే ఉంది. అయితే ఆ మధ్య కాలంలో రాజీవ్ ఎందుకో వెనుకబడిపోయారనే సందేహం చాలా మందికి ఉంది. నిజంగానే రాజీవ్ వెనుకబడిపోయారా? లేదంటే మనకే అలా అనిపించిందా? ఈ విషయంతో పాటు ఎన్నో ఆసక్తికర విషయాలను రాజీవ్ ‘Tagtelugu.com’తో పంచుకున్నారు. ముందుగా అసలు ఆయన ఎందుకు కొంతకాలం పాటు సినిమాల్లో వెనుకబడ్డారు? ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలేంటో చూద్దాం.
ఎందుకు కొంతకాలం పాటు వెనుకబడ్డారని ‘ట్యాగ్ తెలుగు’ రాజీవ్‌ను ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పారు. ఎంతటి నటుడికైనా ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం. లేదంటే ఎన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్దగా ఎవరూ గుర్తించరు. రాజీవ్ విషయంలోనూ అదే జరిగింది. ఆయనెప్పుడూ వెనుకబడింది లేదు. ఏవో ఒక సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రమోషన్స్‌కి మాత్రం వచ్చేవాడిని కానని అందుకే వెనుకబడినట్టు మీకనిపించ ఉండవచ్చని రాజీవ్ తెలిపారు. ఇటీవలి కాలంలో కొందరు తనను ఇదే ప్రశ్న అడగటంతో తనను తాను ప్రమోట్ చేసుకోక తప్పదన్న విషయం గ్రహించానని తెలిపారు. ఇప్పుడిప్పుడు ప్రమోషన్స్‌కి వస్తుండటంతో అసలు ఆయన ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసినట్టు అంతా భావిస్తున్నారు.
అయితే ప్రస్తుతం రాజీవ్ సినిమాలు మాత్రమే కాదండోయ్.. ఎడాపెడా వెబ్‌సిరీస్‌లు కూడా చేసేస్తూ క్షణం తీరిక లేకుండా కాలం గడిపేస్తున్నారు. రాజీవ్ ఒక్క సినిమా కాదు.. ప్రస్తుతం ఆయన చేస్తున్న వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ చాంతాడంత ఉంది. ఆయన నటిస్తున్న వెబ్‌సిరీస్‌ల్లో హోమ్ టౌన్, కానిస్టేబుల్ కనకం అయిపోయాయి. సోనీలివ్ కోసమొకటి, అమెజాన్ ప్రైమ్ కోసం ‘ఇసకపట్నం’ జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం రాజీవ్ ‘జటాధర, విశ్వంభర, సత్యదేవ్ హీరోగా సినిమా, ధర్మస్థల నియోజకవర్గం, మహేంద్రగిరి వారాహి, లిటిల్ హార్ట్స్, నవాబ్ కేఫే, తెరచాప’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి కాకుండా ఇంకో మూడు ప్రాజెక్టులు సైతం కమిట్ అయి ఉన్నారు.
ప్రజావాణి చీదిరాల