పెను దుమారాన్ని రేపిన శిరీష్ వ్యాఖ్యలు.. దిల్ రాజు సుదీర్ఘ వివరణ

‘గేమ్ ఛేంజర్’ విషయమై నిర్మాత శిరీష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. దీంతో దిద్డుబాటు చర్యలకు శిరీష్ మాత్రమే కాకుండా దిల్ రాజు సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ విడుదల తర్వాత హీరో రామ్ చరణ్ కానీ.. దర్శకుడు శంకర్ కానీ తమకకు కనీసం ఫోన్ కూడా చేయలేదంటూ శిరీష్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్.. శిరీష్‌పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా దిల్ రాజు ‘తమ్ముడు’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుదీర్ఘ వివరణ ఇవ్వగా.. మరోవైపు శిరీష్ కోసం ఒక ప్రకటన విడుదల చేశారు.

‘గేమ్‌ ఛేంజర్‌’ లేకుండా గత పది రోజులుగా ఇంటర్వ్యూ అనేదే జరగడం లేదని.. అసలు శిరీష్ ఈ సినిమా కోసం పెద్దగా పని చేయలేదని.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసమే పని చేశారన్నారు. చెర్రీ గురించి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరే సినిమా కోసమూ రామ్ చరణ్ పని చేయలేదని ‘గేమ్ ఛేంజర్’ కోసమే తన సమయాన్ని మొత్తం వెచ్చించి చాలా కమిట్‌మెంట్‌తో పని చేశాడని తెలిపారు. శంకర్ మాత్రం ‘ఇండియన్ 2’ ని మొదలు పెట్టేశాడన్నారు. దీంతో షూటింగ్ సమయం, షెడ్యూల్స్‌పై స్పష్టత లేకపోవడం వంటివి జరిగాయని.. అయినా కూడా పెద్ద దర్శకుడు కావడంతో తాము కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయామన్నారు. తమ బ్యానర్ నుంచి ఈ ఏడాదికి సంక్రాంతికి రెండు సినిమాలు వస్తున్నాయన్నా కూడా చిరంజీవి కానీ.. రామ్ చరణ్ కానీ వద్దనలేదని తమ పూర్తి అంగీకారం తెలిపారన్నారు.

‘గేమ్ ఛేంజర్’ సక్సెస్ అవకుంటే రామ్ చరణ్‌కు బాధ ఉంటుందని.. అందుకే తమ తరుఫున ఒక సక్సెస్ మూవీ ఇవ్వాలనే చెర్రీతో సినిమా చేస్తానని ప్రకటించినట్టు దిల్ రాజు తెలిపారు. శిరీష్ ప్రతి సినిమాను డిస్ట్రిబ్యూటర్ కోణంలోనే చూస్తారని.. ఆ ఉద్దేశంతోనే సినిమా గురించి వ్యాఖ్యానించారన్నారు. చెర్రీతో శిరీష్ చాలా స్నేహంగా ఉంటారని ఆయనపై వ్యాఖ్యలు చేసే ఉద్దేశం తమకు లేదని దిల్ రాజు తెలిపారు. ‘నేను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా ద్వారా అపార్థాలకు దారి తీశాయి. దీంతో కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం రామ్‌చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. చిరంజీవి కుటుంబానికి, మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి, రామ్‌చరణ్, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మేం మాట్లాడం. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టేలా ఉంటే క్షమించండి’ అని నిర్మాత శిరీష్‌ సైతం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *