ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాల పరంగా కూడా శరవేగంగా దూసుకెళుతున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని చకచకా పూర్తి చేసుకుంటోంది. పవన్ సైతం తన వంతు సహకారాన్ని సినిమా కోసం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పవన్ డబ్బింగ్‌ను పూర్తి చేశారు. విశేషమేంటంటే.. ఆయన ఏకధాటిగా నాలుగు గంటల పాటు కూర్చొని డబ్బింగ్‌ను కంప్లీట్ చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ‘‘హరి హర వీరమల్లు’ డబ్బింగ్‌ను పవన్ కల్యాణ్ ఫైర్, అన్‌స్టాపబుల్ ఫోకస్‌తో పూర్తి చేశారు. ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా రాత్రి 10 గంటలకు డబ్బింగ్ ప్రారంభించారు. ఆపై ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేశారు’’ అని తెలిపారు. తొలిసారిగా పవన్ ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.
ప్రజావాణి చీదిరాల