అసెంబ్లీ రౌడీ చిత్రంలో పాకీజా పాత్రలో నటించిన వాసుకి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో ఆమె పేరు పాకీజాగా స్థిరపడిపోయింది. ఆ తరువాత పెదరాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్ వంటి సినిమాలు చేసింది. ఆ తరువాత అవకాశాలు రాకపోవడం వల్లనో.. మరో కారణమో కానీ సంపాదించిన డబ్బంతా పోగొట్టుకుంది. చివరకు అత్యంత దీన స్థితికి చేరిన వాసుకికి సినీ ప్రముఖులు పలువురు తమకు తోచిన సాయం చేశారు. దీంతో ఒక ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంతా అనుకున్నారు. కట్ చేస్తే ఆమె తిరుపతి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించింది. తాజాగా ఆమె దీన స్థితిలో ఉందని తెలిసి.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆమె కథలో సినిమాను మించిన ట్విస్టులున్నాయి.
అసలు వాసుకికి సినీ ఇండస్ట్రీ నుంచి అందిన డబ్బు ఏమైంది? ఎందుకు భిక్షాటన చేయాల్సి వచ్చిందనే విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తను కష్టాల్లో ఉన్నప్పుడు టాలీవుడ్ నుంచి రూ.7.5 లక్షల దాకా సాయం అందిందని.. ఆ డబ్బును తానేమీ వృథాగా ఖర్చు చేయలేదని చెప్పుకొచ్చింది. మూడున్నర లక్షలు అప్పులు కట్టానని.. కొంత డబ్బు హైదరాబాద్‌లో ఇంటికి అడ్వాన్స్ ఇచ్చానని తెలిపింది. ఆ తరువాత వంట సామాగ్రి కోసం కొంత ఖర్చు చేశానని.. ఆపై హైదరాబాద్ నుంచి చెన్నై, కారైకూడి, మధురై వెళ్లేందుకు డబ్బంతా అయిపోయిందని తెలిపింది. టాలీవుడ్‌లో అవకాశాలు దొరక్క చెన్నై వెళ్లానని.. అక్కడ తనకు ఇంటి అద్దె కట్టడమే కష్టమై పోయిందని తెలిపింది. కనీసం ఇళ్లలో పాచి పని చేద్దామన్నా నటిని కావడంతో ఎవ్వరూ ఇవ్వలేదని తెలిపింది. ఆరు నెలల్లో పరిస్థితి చేజారిపోయిందని.. చివరకు ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని తెలిపింది. పది రూపాయలతో ఇడ్లీ పిండి కొనుక్కుని ఉదయం, సాయంత్రం ఇడ్లీ తినేదట. మధ్యాహ్నం గంజి తాగేసి కాలం గడిపేదట. పవన్ సాయాన్ని ఎన్నటికీ మరువనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్‌బాస్ ఫేమ్ మిత్రా శర్మ సైతం ఈ ఇంటర్వ్యూలోనే పాకీజాకు రూ.50 వేలు సాయం అందించింది.