Odela 2 Review: ‘ఓదెల 2’ మెప్పించిందా?

విడుదల తేది: 17-04-2025
చిత్రం: ఓదెల 2
నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి

సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్: సంపత్ నంది
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
నిర్మాత: డి మధు
దర్శకత్వం: అశోక్ తేజ

సోల్ వర్సెస్ సూపర్ నేచురల్ పవర్స్ అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఓదెల 2’. తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం తప్పక సక్సెస్ అవుతుందని మేకర్స్ ఆశాభావంతో ఉన్నారు. అలాగే ఈ సినిమా తొలిభాగం మంచి సక్సెస్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? అసలు సినిమా ఎలా ఉంది? చూద్దాం.

కథేంటంటే..

ఓదెల గ్రామంలో అమ్మాయిలను శోభనం రోజు తిరుపతి (వశిష్ట సింహా) పైశాచికత్వంగా అనుభవిస్తుంటాడు. దీంతో భార్య రాధ (హెబ్బా పటేల్).. తిరుపతిని చంపేస్తుంది. అతనికి గ్రామస్తులంతా కలిసి సమాధి శిక్ష వేస్తారు. ఆ తరువాత సమాధి నుంచి తిరుపతి ఆత్మ బయటకు వచ్చి మళ్లీ గ్రామాన్ని పట్టి పీడిస్తుంది. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది. అతడిని సంహరించేందుకు వచ్చిన భైరవి (తమన్నా) ఎదుర్కొన్న సవాళ్లేంటి? చివరకు ఆత్మ వినాశనం జరిగిందా? లేదా? అనేది కథ.

సినిమా ఎలా ఉందంటే..

చెడుపై మంచి గెలిచిందనే కథాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ కథాంశం కూడా అదే. అయితే ఇప్పుడు ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. లేదంటే ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే సినిమా చూస్తున్నారు. ఇవి రెండూ లేవంటే ప్రేక్షకులు ఆ సినిమా థియేటర్ వైపు చూడటం కూడా కష్టమే. ఈ సినిమా విషయానికి వస్తే కథ పాతదే.. కథనంలోనూ కొత్తదనం లేదు. సినిమా ఏం జరగబోతోందనేది క్లియర్‌గా తెలిసిపోతోంది. గ్రాఫిక్స్, ఏఐ బీభత్సంగా వాడేశారు. పోనీ ఆకట్టుకునేలా ఉన్నాయా? అంటే అదీ లేదు. కొన్ని సీన్లు చిన్న పిల్లాడికి సైతం అర్థమయ్యేలా ఉన్నాయి. తొలి భాగం మనిషి రాక్షసుడిగా మారి జనాలను హింసిస్తే.. రెండవ భాగంలో రాక్షసుడు మనిషిగా మారి హింసకు పూనుకుంటాడు. అంతకు మించి కథలో ట్విస్ట్‌లు, టర్న్‌లు ఏమీ లేవు.

ఎవరెలా చేశారు? టెక్నికల్ పరంగా ఎలా ఉంది?

భైరవి పాత్రలో తమన్నా చక్కగా నటించింది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ పాత్రలు సైతం బాగానే ఉన్నాయి కానీ తమన్నా ముందు హెబ్బా తేలిపోయింది. ఇక ఈ పాత్రలు మినహా మిగిలినవన్నీ ప్రాధాన్యం లేని పాత్రలే. ఓదెల 2 సినిమా కంటెంట్ పరంగా కాకుండా టెక్నికల్‌గా పెద్దగా ఏం లేదనే చెప్పాలి. ఒకటీ అర సన్నివేశాలు మినహా అంత హైలైట్‌గా ఏమీ లేదు. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు పర్వాలేదనిపిస్తాయి.

ప్లస్: తమన్నా నటన

మైనస్: సాగదీత, కథలో కొత్తదనం లేకపోవడం, గ్రాఫిక్స్

చివరిగా ‘ఓదెల 2’ సగటు ప్రేక్షకుడిని మెప్పించడం కష్టమే.

రేటింగ్: 2.5/5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *