NO IS NO : అలాంటివారికి నా ఆవేదన అభ్యర్ధన ప్రార్థన….

NO IS NO MEN OR WOMEN :

ఆడలేదు, మగలేదు అందరూ ఒక్కటే…ఎ నో ఈజ్‌ నో అనే సూత్రం మానవధర్మం.

అమితాబ్‌ గారు ‘పింక్‌’ సినిమాలో చెప్పిన పవన్‌కల్యాణ్‌ గారు ‘వకీల్‌సాబ్‌’లో వద్దు అని చెప్పిన ‘నో ఈజ్‌ నో’ అనేది గొప్పమాట, గొప్ప నీతి, గొప్ప ధర్మం.

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నమాటను కొంచెం మార్చుకుంటూ మానవ సంబంధాలన్నీ సెక్సువల్‌ రిలేషన్సే అనే పంధాన వెళుతుంది ప్రస్తుత సమాజం.

అయ్యో పాపం ఆడాళ్లు..మీకు ఎన్ని కష్టాలు అడుగు పెట్టిన ప్రతిచోటా మిమ్మల్ని ఇబ్బందులపాలు చేసే రాబందుల కళ్లే ఉంటాయి.

ఎన్నో రాబంధుల నుండి మిమ్మల్ని కాపాడుకోవటం తప్ప ఈ ప్రపంచంలో మరో ఉద్యోగం లేకుండా పోయింది మీకు.

అది చిత్ర పరిశ్రమ అయినా వ్యాపార ప్రదేశాలైనా, సాఫ్ట్‌వేర్‌ కారిడార్లయినా, ఆసుపత్రులైనా, పోలీస్‌స్టేషన్లైనా, న్యాయస్థానాలైనా,

మీడియా హౌసెస్‌ అయినా ఎక్కడైనా మీకు ఆపాయాలు మీ చుట్టే, మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్న ఈ సమాజంలో ఎంతో చాకచాక్యంగా మీరు బతుకుతున్నారు.

చాలాచోట్ల మగవాడి కంటే ఎంతో గొప్పగా బతుకుతున్నారు. గొప్పగా బ్రతుకుతున్న ప్రతిచోటా ఆడ, మగ తేడాలేదు టాలెంట్‌ మాత్రమే ఇంపార్టెంట్‌ అని మీరు చెప్తున్న ప్రతిసారి మీ పక్కనే ఉంటే చప్పట్లు చరుస్తూ జేజేలు పలుకుతున్నాం.

మా ఇంటి ఆడపడుచుల్లాగా ఫీలవుతున్నాం. రొమ్ము విరుచుకుని ఈ పిల్ల మా పిల్ల… శివంగిలా సమాజంతో ఫైట్‌ చేసి తనను తాను నిరూపించుకుంటుంది అని ఎన్నోసార్లు మీ టాలెంట్‌ని భుజాన మోస్తూ ఊరు వాడ ప్రచారం చేస్తున్నాం.

అందుకే స్వాతంత్య్రం వచ్చిన ఈ 75ఏళ్లలో ఎంతో గొప్పగా రాణిస్తున్న మీ అందరిని చూసి గర్వపడుతున్నాం.

ఆడది అర్ధరాత్రి పూట ఎలాంటి బట్టలైనా వేసుకుని అర్థనగ్నంగా తిరగాలి అన్న మీ కలలు చాలావరకు నెరవేరాయి అనుకుంటున్నా. అన్ని పరిశ్రమల్లోను విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

కానీ, ఆడపిల్లకి కష్టమొచ్చిన ప్రతిసారి ఒక్క చిత్ర పరిశ్రమను మాత్రమే టార్గెట్‌ చేస్తూ మాట్లాడటం సమంజసం కాదు అనుకుంటున్నా.

ఆ కష్టమొచ్చిన ఆడపిల్లని ఖచ్చితంగా మనందరం కాపాడుకుందాం. అందులో సవాలే లేదు. ఖచ్చితంగా చట్టపరంగా, న్యాయపరంగా కఠినమైన శిక్షలను అమలు చేసి ఇబ్బందులపాలైన ఆడపిల్లలను అక్కున చేర్చుకుందాం.

వారు ఇబ్బంది పడకుండా వేగంగా తగుచర్యలు తీసుకునే విధంగా మన చట్టాలను మార్చటానికి ఉద్యమాలు చేద్దాం. కానీ ఇక్కడ ఆడపిల్లకి ఒక న్యాయం మగవాడికి మరో న్యాయం వద్దు.

అందరికి సమానమైన న్యాయం ఉండాలి. పోలీస్‌ స్టేషన్లకి వెళ్లి ఒకసారి విచారించండి. ఆడపిల్లకి బాసటగా నిలుస్తుంది అని రూపొందొంచిన 498 సెక్షన్‌ని ఎన్ని రకాలుగా అక్రమంగా కేసులు పెట్టి గృహహింస చట్టం అన్యాయంగా వాడుతున్నారో అమాయకుల మీద కావాలని ప్రయోగిస్తున్నారో.

అలాగే ఈరోజు మీరు అవకాశం ఇవ్వండి మీరు చెప్పినట్లే చేస్తాం అంటూ రోజు ఎంతోమంది నూతన నటీనటులు అవకాశాల కోసం ఇండస్ట్రీలో తిరుగుతున్నారు.

వారికి అవకాశం ఇస్తున్నారో ఇవ్వటంలేదో అవకాశం వచ్చిన వారిని అడిగి చూస్తే తెలుస్తుంది. వారిలో ఏ ఒక్కరో ఇద్దరో పుష్కరకాలం తర్వాత పేరు తెచ్చుకున్న తర్వాత పన్నెండేళ్ల క్రితం ఆ రోజు వాడు నన్ను అలా చేశాడు.

నన్ను ఇలా వాడుకున్నాడు అనటం ప్రేక్షకుడు చూస్తున్నప్పుడు అవునా? ఆ రోజు ఆ అమ్మాయి ఎందుకు నోరు విప్పలేదు?

ఈ రోజు ఎందుకు మాట్లాడుతుంది అనే ప్రశ్నను తనలోతానే వేసుకుని తనకి ఇష్టం వచ్చిన సమాధానం చెప్పుకుని సర్దుకుపోతుంటాడు సదరు ప్రేక్షకుడు.

ఆ నటి గతంలో ఏమేం సినిమాలు చేసింది మొదట ఎక్కడనుండి వచ్చింది అంటూ ఆరాలు తీయటం మొదలుపెడతారు.

ఆ నటి ఇప్పటికి తన పేరు మారుమోగిపోవటం కోసం సోషల్‌మీడియాలో చెలరేగిపోవటం రచ్చ చేయటం ఏరోజు కారోజు చూస్తూనే ఉన్నాం.

వీళ్లు మాట్లాడేది నిజమా? కాదా? అని తేలేలోపు అవతలవారికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మీ టార్గెట్‌ మీకు న్యాయం జరగటమా? అవతల వారికి నష్టం జరగటమా? అనేది చూసేవారికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలా మిగిలిపోతుంది.

కొన్ని కేసుల్లో అయితే నన్ను ఆరునెలలు పాటు వాడుకుని అవకాశం ఇచ్చాడని ఒకామె అంటే నేను కలిసిన నాలుగుసార్లు నన్ను రేప్‌ చేశాడు అని ఒకామె అంటుంది.

నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఆరునెలలపాటు ఎలా వాడుకుంటాడు? ఒకసారి బలత్కారం చేస్తే రేప్‌ అవుతుంది కానీ నాలుగుసార్లు ఎలా రేప్‌ చేస్తాడు? గతంలో ఆమెతో పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్లు అందరూ ఆమెను గమనిస్తుంటారు.

ఏ సినిమా సమయంలో ఎవరి గురించి ఎలా మట్లాడుతుందో అని మల్లగుల్లాలు పడుతూ ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వారికి ఏ ఫోన్‌ వచ్చినా కంగారు పడుతుంటారు.

గత 15 –20 ఏళ్లలో తాము చిత్రపరిశ్రమలో పని చేసినప్పుడు ఉన్న ఆర్టిస్టులు ఇప్పుడు బయటకు వచ్చి విపరీతంగా మాట్లాడుతుంటే ఏరోజు ఆ టాపిక్‌లో వాళ్ల పేర్లు వినిపిస్తాయో అని కంగారుపడటం నా కళ్లారా చూశాను.

ఎందుకు సినిమా పరిశ్రమకే ఇలాంటి దుస్థితి? పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇతర లేడి పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు లేవా? లాయర్ల వృత్తిలో ఉండేవారు తమ లేడి క్లయింట్స్‌తో ఎలా బిహేవ్‌ చేస్తారో ఎప్పుడైనా బయటకొస్తుందా?

సాఫ్ట్‌వేర్‌ మేనేజర్స్‌కి తన టీమ్‌తో ఉండే సంబందాలు అన్ని మీడియాలో మాట్లాడుతున్నారా? డాక్టర్స్‌ అందరూ న్యాయంగా వైద్య వృత్తిని మాత్రమే చేస్తున్నారా? వారికి ఎటువంటి ఎఫైర్స్‌ లేవా? ఒక్కసారి పోలీస్‌స్టేషన్లకు వెళ్లి గమనించండి. ఎన్ని రకాల కేసులు ఉంటున్నాయో.

కానీ చిత్ర పరిశ్రమలో మాత్రం ఎక్కడైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిమీద పుంకానుపుంకాలుగా కథలు వచ్చి ఎవరి చేతనైన కథలు వారు అల్లి ఆ కథలను ప్రజలకు వార్తల ద్వారా చేరవేస్తారు, చేరవేస్తున్నారు.

గతంలో మీడియాతో ఎంతో స్నేహంగా ఉండే చిత్రపరిశ్రమ ఇప్పుడు జరిగే తప్పులన్నింటిని చూస్తూ ఎవరి ఫోన్‌ ఎత్తితే ఎటువంటి ప్రాబ్లమ్స్‌ వస్తాయో అని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

తప్పును తప్పుడు మనుషులను ఎవరు సమర్ధించరు? అది ఆడైనా, మగైనా. కానీ ఇక్కడ సమస్యల్లా ఒక్కటే…ఈ రోజు మీకు జరిగిన అన్యాయాన్ని ఈ రోజే గొంతెత్తి అరవండి.

మీకు న్యాయం జరగేటట్లు చట్టంతోపాటు న్యాయవ్యవస్థ మీ చుట్టూ చుట్టంలా ఉన్నాయి.

ఈ రోజు మీకు ఇబ్బంది కలిగితే పదేళ్ల తర్వాత మీకు వచ్చిన సమస్యని గురించి మీరు మాట్లాడుతుంటే ఆయ్యే పాపం అనలా? ఇప్పుడెందుకు ఈ విషయం మాట్లాడుతుంది అని క్వశ్యన్‌ చేయాలా ? అని అర్థంకావట్లేదు.

అనవసరమైన రాద్ధాంతాలు చేసేముందు ఒకసారి అందరూ ఆలోచించండి. ఎంతో ధర్మబద్దంగా నాకొచ్చిన సందేహాలను పేపర్‌ మీద పెట్టాను. ఆడవాళ్ల ఆత్మీయుణ్ని, మగవాళ్ల స్నేహితుడిని, చిత్రపరిశ్రమ ప్రేమికుణ్ని…

శివ మల్లాల

Also Read This Article : వరదబాదితులను ఆదుకుంటున్న తెలుగు చిత్ర పరిశ్రమ…

Vindhya Vishaka Exclusive interview
Vindhya Vishaka Exclusive interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *